ప్రపంచవ్యాప్తంగా ఎదురైన విమర్శలతో రాజకీయ ప్రకటనలపై కీలక నిర్ణయం తీసుకుంది సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్‌బుక్. రాజకీయ ప్రకటనల విషయంలో నిబంధనలను కఠినతరం చేసింది. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇక నుంచి ప్రకటనకర్తలు పూర్తి వివరాలు ఇవ్వాల్సిందిగా నిబంధనలు తెచ్చింది.
వివరాలు లేకపోతే యాడ్స్‌పై వేటు
ఫేస్‌బుక్‌లో ప్రకటనలు ఇచ్చే వారు ఎవరు? ఎక్కడి వారు? అనే వివరాలు పొందుపరచాల్సి ఉంటుంది. ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ లేదా ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ వద్ద రిజిస్టర్ అయినట్లుగా సాక్ష్యం చూపాలని పేర్కొంది. తగిన ఆధారాలు సమర్పించకుంటే అక్టోబర్ రెండో వారం నాటికి ఆ ప్రకటనలను నిలిపివేస్తామని స్పష్టం చేసింది.
వీరికి వెసులుబాటు...
చిన్న వ్యాపారులు, స్థానిక రాజకీయ నేతల విషయంలో కొంత వెసులుబాటు కల్పించింది. ఫోన్ నంబర్‌తో పాటు వ్యక్తిగత సమాచారం మెయిల్ చేయడం ద్వారా ప్రకటనలు ఇవ్వొచ్చని తెలిపింది. ఇటువంటి యాడ్స్‌కు ఎలాంటి ధ్రువీకరణ ట్యాగ్ ఉండదని స్పష్టం చేసింది. ఓటింగ్‌లో పాల్గొనకుండా ప్రోత్సహించే యాడ్స్‌ను సైతం నిషేధిస్తామని ఫేస్‌బుక్ వెల్లడించింది.
ఈ నిబంధనలతో తమను ఎవరు ప్రభావితం చేస్తున్నారనే విషయం ప్రజలకు తెలుస్తుందని ఫేస్‌బుక్ తెలిపింది. ఇకపై ముసుగులో ఓటర్లను ప్రభావితం చేయడం కుదరదని స్పష్టం చేసింది.
కేంబ్రిడ్జి అనలిటికాతో గుణపాఠం
గతంలో కేంబ్రిడ్జి అనలిటికా అనే రాజకీయ సమాచార విశ్లేషణ సంస్థకు ఫేస్‌బుక్ 5 కోట్ల మంది వినియోగదారుల వ్యక్తిగత సమాచారం అమ్మిందన్న ఆరోపణలు ఎదుర్కొంది ఫేస్‌బుక్. ఆ సమాచారాన్ని కేంబ్రిడ్జి అనలిటికా డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వ ప్రచారానికి అనుకూలంగా ఉపయోగించిందన్న వార్తలు పెను దుమారమే సృష్టించాయి. బ్రెగ్జిట్ రెఫరెండం సమయంలోనూ దీన్ని ఉపయోగించారని పరిశోధనలో వెల్లడైంది. ఫేస్‌బుక్, కేంబ్రిడ్జి అనలిటికాలు అమెరికా, బ్రిటన్ దేశాల్లో న్యాయ విచారణ ఎదుర్కొన్నాయి.
ఇదీ చూడండి: 3నెలల్లో 7.5 కోట్ల స్మార్ట్ ఫోన్లు అమ్మిన శాంసంగ్