దేశవ్యాప్తంగా రేపటి నుంచి రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చాయి బ్యాంకు యూనియన్లు. ఈ నెల 31, ఫిబ్రవరి 1న సమ్మె చేయనున్నట్లు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్బీయూ) ఇది వరకే వెల్లడించింది.
ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ (ఐబీఏ)తో ఈ నెల 13న జరిగిన వేతన సమీక్ష చర్చలు విఫలమైన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాయి యూనియన్లు.
దేశవ్యాప్తంగా ఉన్న తొమ్మిది ప్రధాన బ్యాంకు యూనియన్ల తరఫున యూఎఫ్బీయూ ఈ చర్చల్లో పాల్గొంది.
సమ్మె నేపథ్యంలో రెండు రోజులపాటు ప్రభుత్వ రంగ బ్యాంకుల కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడనుంది. ఎస్బీఐ సహా పలు బ్యాంకులు సమ్మెపై ఇప్పటికే ప్రకటన చేశాయి.
నిరవధిక సమ్మెకూ సిద్ధం..
ఈ రెండు రోజుల సమ్మె తర్వాత తమ డిమాండ్లను అంగీకరించకుంటే మార్చి 11-13 మధ్య మరోసారి సమ్మెకు దిగనున్నట్లు యూఎఫ్బీయూ తెలిపింది. ఆ తర్వాత ఏప్రిల్ 1 నుంచి నిరవధిక సమ్మె చేయాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేసింది.
15 శాతం పెంచాలని..
ఐబీయూతో జరిగిన చర్చలో వేతనాలు 15 శాతం పెంచాలని యూఎఫ్బీయూ కోరింది. ఐబీఏ మాత్రం 12.25 శాతం పెంపునకు మాత్రమే సుముఖత చూపించిందని సమాచారం.
ఇదీ చూడండి:ఈ ఏడాది మరింత పెరగనున్న బంగారం ధర!