గత సంవత్సరంలానే ఈ ఏడాదీ ఒకేసారి మూడు ఐఫోన్ మోడళ్లను అవిష్కరించేందుకు యాపిల్ సిద్ధమవుతోంది. ఫోన్లతో పాటు నెట్‌ఫ్లిక్స్ లాంటి వీడియో సేవల ప్రారంభంపై కసరత్తు చేస్తోంది. మంగళవారం జరగనున్న వార్షిక హార్డ్‌వేర్ ప్రదర్శనలో కొత్త ఐఫోన్ మోడళ్ల వివరాలు వెల్లడించనుంది యాపిల్. ఈ కార్యక్రమంలోనే వీడియో సేవలపైనా స్పష్టత రానుంది.
గత ఏడాది ఆవిష్కరించిన ఐఫోన్ ఎక్స్ఆర్, ఎక్స్ఎస్, ఎక్స్ఎస్ మ్యాక్స్‌లకు కొనసాగింపుగా ఈ కొత్త మోడళ్లు వచ్చే అవకాశముంది. వీటి ధర 750 డాలర్ల నుంచి 1,100 డాలర్ల మధ్య ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.
యాపిల్ కొత్త మోడళ్లను తీసుకువస్తున్నప్పటికీ.. వాటి ఫీచర్ల విషయంలో కొత్తదనం ఉండటంలేదనే వాదనలున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త మోడళ్లను సరికొత్త ఫీచర్లతో తీసుకువచ్చే అవకాశముందని టెక్ విశ్లేషకుల అంచనా.
ముఖ్యంగా కెమెరాల విషయంలో యాపిల్ భారీ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. గత మోడళ్లతో పోలిస్తే.. కొత్త మోడళ్లన్నీ అదనపు కెమెరాతో రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జూమింగ్ కోసం టెలిఫోటోలెన్స్ను వాడుతోంది యాపిల్. ఇప్పుడు దూరంగా ఉన్న దృశ్యాలు చిత్రీకరించేందుకు వైడ్ యాంగిల్ లెన్స్‌ను ఐఫోన్ కెమెరాల్లో నిక్షిప్తం చేసినట్లు టెక్ వర్గాలు అంటున్నాయి.
ఈ సరికొత్త ఫీచర్లు తెచ్చినప్పటికీ.. ప్రధాన ప్రత్యర్థులైన శాంసంగ్, హువావే, లేనోవో, గూగుల్‌లతో గట్టి పోటీ ఉండనున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చూడండి: 'అలీబాబా' ఛైర్మన్ పదవికి జాక్ మా వీడ్కోలు