Rupee depreciation: జనవరి 5, 2018న సోమేశ్ అమెరికా టూర్‌కు వెళదామని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు. ప్రయాణ, హోటల్ ఖర్చులతో పాటు ఎంతవుతుందో ఓ అంచనా వేసుకున్నాడు. అలా ఓ రూ.15 లక్షలు పొదుపు చేయాలని నిర్ణయించుకున్నాడు. దీనికి 7 శాతం ద్రవ్యోల్బణాన్ని కలుపుకొని మరో రూ.1.05 లక్ష రూపాయలు అదనంగా కూడా జమ చేయాలనుకున్నాడు. తీరా నాలుగేళ్లలో అతని ప్రణాళికలన్నీ తలకిందులయ్యాయి. 2022లో తిరిగి అతని ప్రణాళికల్ని సమీక్షించుకుంటే ఖర్చులు 20 శాతం పెరిగినట్లు తెలుసుకొని నిరాశపడ్డాడు.
గత నాలుగేళ్లలో డాలరుతో రూపాయి మారకపు విలువ రూ.77కు పతనమైంది. జనవరి 5, 2018న ఇది రూ.63.26గా ఉంది. ఈరోజు (మార్చి 16, 2022)కి రూ.76.40కి అటూఇటూగా చలిస్తోంది. మార్చి 07, 2022న జీవనకాల గరిష్ఠమైన రూ.77.08 తాకింది. అంటే సోమేశ్ ఒక డాలరు కొనుగోలుకు 2018లో రూ.63.26 చెల్లించాల్సి ఉంటే.. ఇప్పుడు దాదాపు రూ.76.50 వెచ్చించాలి. అంటే 21 శాతం అదనంగా వెచ్చించాల్సి వస్తోంది. ద్రవ్యోల్బణంతో కలుపుకొని రూ.16 లక్షలు అనుకున్న అంచనా కాస్తా రూ.18.20 లక్షలకు చేరింది. అంటే ఒక డాలర్ కొనుగోలుకు నాలుగేళ్ల క్రితంతో పోలిస్తే.. ఇప్పుడు 21 శాతం అదనంగా ఖర్చు చేయాలన్నమాట. దీన్నే రూపాయి విలువ పతనం అంటారు.
ఇలా విదేశీ విహారయాత్రలే కాదు.. మన రోజువారీ ఖర్చులపై కూడా రూపాయి పతనం ప్రభావం చూపుతుంది. అధిక ఇంధన ధరలు, వడ్డీరేట్ల రూపంలో మన జేబులకు చిల్లు పడుతుంది.
రూపాయి పడింది ఇందుకే..
ఒక దేశ కరెన్సీ విలువ డిమాండ్‌ను బట్టి మారుతుంటుంది. గిరాకీ పెరిగితే విలువ పెరుగుతుంది. డిమాండ్ తగ్గితే విలువ తగ్గుతుంది. విదేశీ పెట్టుబడులు పెరిగితే.. రూపాయికి డిమాండ్ పెరుగుతుంది. ఎందుకంటే.. విదేశీ మదుపర్లు లేదా కంపెనీలు భారత్‌లో పెట్టుబడి పెట్టాలన్నా, వస్తువులు కొనుగోలు చేయాలన్నా.. తొలుత వారు వారి కరెన్సీని రూపాయల్లోకి మార్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే భారత్‌లో ఇన్వెస్ట్ చేయాలన్నా.. వస్తువులు కొనుగోలు చేయాలన్నా రూపాయిని మాత్రమే మారక ద్రవ్యంగా ఆమోదిస్తారు. అలా రూపాయికి డిమాండ్ పెరుగుతుంది.
మరోవైపు భారతీయులు లేదా మన కంపెనీలు చమురు, బంగారం సహా ఇతర వస్తువులేమైనా దిగుమతి చేసుకోవాలంటే చెల్లింపులు డాలర్లలో చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అంతర్జాతీయ వాణిజ్యంలో డాలరును ప్రామాణికంగా పరిగణిస్తారు. అంటే భారత్ రూపాయలు ఇచ్చి డాలర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అప్పుడు డాలరుకి డిమాండ్ పెరుగుతంది. ఫలితంగా రూపాయి బలహీనపడుతుంది.
గణాంకాలను పరిశీలిస్తే.. 1992లో ఒక డాలరుకి రూ.26 చెల్లించాల్సి వచ్చింది. అది ఇప్పుడు రూ.77కి చేరింది. అంటే రూపాయి సగటున ఏడాదికి 3.7 శాతం చొప్పున పతనాన్ని చవిచూసింది. భారత్ నికర దిగుమతిదారు దేశమన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. 3.7 శాతం పతనం పెద్దగా ఆందోళన కలిగించే విషయమేమీ కాదు. కానీ, ఆ పతనం ఒక్కసారి సంభవిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఒక నెలలో రూపాయి విలువ 3.7 శాతం కంటే ఎక్కువ పతనమైతే ఇబ్బందులు తప్పవు. ఇప్పుడు అదే పరిస్థితి నెలకొంది. మరి ఇంతలా పడడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి..
విదేశీ పెట్టుబడిదారుల నిష్క్రమణ..
అమెరికా కేంద్ర బ్యాంకైన ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను పెంచనున్నట్లు ప్రకటించింది. మరోవైపు రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దీంతో విదేశీ మదుపర్లు భారత్ నుంచి నిష్క్రమిస్తున్నారు. వారు పెట్టుబడుల్ని ఉపసంహరించుకున్నప్పుడు రూపాయల్లో వారి డబ్బును పొందుతారు. తిరిగి వాటిని డాలర్లలోకి మార్చుకుంటారు. అంటే డాలరుకి గిరాకీ పెరుగుతుంది. ఫలితంగా డాలర్ బలపడి రూపాయి పతనమవుతుంది.
చమురు ధరల భారం..
భారత్ తన చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతుంది. 2022 ఆరంభంతో పోలిస్తే.. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు గణనీయంగా పెరిగాయి. దీంతో చమురు కొనుగోలుకు భారత కంపెనీలు ఎక్కువ మొత్తంలో డాలర్లను చెల్లించాల్సి వస్తోంది. అలా డాలరుకి డిమాండ్ పెరిగి రూపాయి బలహీనపడుతుంది.
రూపాయి పతనం.. మన జేబుపై ప్రభావం..
రూపాయి విలువ తగ్గడం వల్ల మన ఆర్థిక పరిస్థితులపై ప్రత్యక్షంగా ప్రభావం ఉంటుంది.
ద్రవ్యోల్బణ పెరుగుదల..
ఇందాక చెప్పుకున్నట్లు డాలరు బలపడితే.. చమురు ధరలు పెరుగుతాయి. విదేశీ వస్తువుల కొనుగోలు వ్యయం సైతం ఎగబాకుతుంది. అంటే దిగుమతులు ఖరీదుగా మారతాయి. ఫలితంగా దిగుమతి చేసుకున్న వస్తువుల ఆధారంగా వచ్చే సహ-ఉత్పత్తుల ధరలన్నీ పెరుగుతాయి. పెరిగిన వ్యయాలను కంపెనీలు పూర్తిగా భరించలేవు. వాటిని వినియోగదారులకు బదిలీ చేసి భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తాయి. అలా ప్రయాణ ఖర్చులు ఫలితంగా ఇతర వస్తువుల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది.
వడ్డీరేట్లు పైపైకి..
ఓ మోతాదు స్థాయి ద్రవ్యోల్బణం ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థకు వాంఛనీయమే. వ్యాపారకార్యకలాపాలకు అనువుగా ఉంటుంది. కానీ, ద్రవ్యోల్బణం ఒకేసారి పెరగడం దేశ ఆర్థిక వ్యవస్థకు అంత శ్రేయస్కరం కాదు. భారత్‌లో ఆర్‌బీఐ ద్రవ్యోల్బణ నియంత్రణ బాధ్యతల్ని నిర్వర్తిస్తుంది. ఒకవేళ ద్రవ్యోల్బణం పెరిగితే.. దాని కట్టడికి ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్లను పెంచుతుంది. అంటే బ్యాంకులకు నిధుల సమీకరణ ఖరీదుగా మారుతుంది. ఆ భారాన్ని బ్యాంకులు వినియోగదారులపైకి బదిలీ చేస్తాయి. దీంతో రుణాలపై వడ్డీరేట్లు పెరుగుతాయి.
పోర్ట్‌ఫోలియో విలువలో తరుగుదల..
విదేశీ మదుపర్లు భారీ ఎత్తున విక్రయాలకు పాల్పడితే.. దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకులు ఎదుర్కొంటాయి. ఫలితంగా స్టాక్స్, మ్యూచువల్ ఫండ్లలో పెట్టిన పెట్టుబడులు నష్టాల్ని చవిచూసే అవకాశం ఉంది. డెట్ ఫండ్లు సైతం కుంగే ప్రమాదం ఉంది.
విదేశీ చదువులు మరింత ఖరీదు..
భారత్ నుంచి చాలా మంది విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళుతుంటారు. వారి ఖర్చుల నిమిత్తం పంపే డబ్బులు డాలర్లలోకి మార్చాల్సి ఉంటుంది. అంటే ఒక డాలరుకి ఎక్కువ మొత్తంలో రూపాయల్ని వెచ్చించాల్సి ఉంటుంది.
ప్రయోజనం పొందే మార్గాలివే..
రూపాయి పతనం సాధారణంగా మన ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావమే చూపుతుంది. కానీ, దీన్ని ప్రయోజనకరంగా మార్చుకునేందుకు కొన్ని మార్గాలు కూడా ఉన్నాయి. విదేశీ ఫండ్లలో మదుపు చేయడం ద్వారా లబ్ధి పొందొచ్చు. ఫలితంగా మీకు విదేశీ కరెన్సీలపై అవగాహన కూడా ఏర్పడుతుంది. అంతర్జాతీయ ఫండ్లలో రూపాయల్లో మదుపు చేయడం వల్ల ఒకవేళ డాలరు విలువ పెరిగినా.. రూపాయి విలువ పడినా లాభపడొచ్చు.
మరో మార్గం ఏంటంటే.. విదేశీ మారకపు ఆదాయం ఎక్కువగా ఉన్న కంపెనీల్లోకి మీ పెట్టుబడులను మళ్లించడం ద్వారా రూపాయి పతనమైనా లాభపడే అవకాశం ఉంది. ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా రంగాల్లోని కంపెనీలు విదేశాలకు తమ ఉత్పత్తుల్ని భారీ ఎత్తున ఎగుమతి చేస్తుంటాయి. వారికి డాలర్లలోకి వచ్చే చెల్లింపులు రూపాయల్లోకి మార్చితే ఆదాయం భారీ ఎత్తున పెరుగుతంది. ఫలితంగా లాభాలూ ఎగబాకుతాయి. ఇది వాటి స్టాక్ విలువపై నేరుగా ప్రభాం చూపుతుంది. అంటే పోర్ట్‌ఫోలియో వివిధీకరణ, సమీక్ష వల్ల రూపాయి పతనాన్ని సైతం ప్రయోజనకరంగా మార్చుకునే వీలుంటుంది. అలాగే రూపాయి బలహీనపడి.. డాలరు బలపడితే.. ఎగుమతుల వ్యాపారాలు సైతం కళకళలాడతాయి.
ఇదీ చూడండి: 'సర్కారు వారి క్రిప్టోకరెన్సీ'.. కేంద్రం ఏమందంటే?