దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకు తీవ్రమవుతోంది. ప్రస్తుత పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వానికి కార్పొరేట్లు చేయుతనిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు దిగ్గజ సంస్థలన్నీ భారీ విరాళాలతో ముందుకొస్తున్నాయి. పీఎం కేర్స్‌కు రూ.257.5 కోట్లు విరాళం ఇస్తున్నట్లు ప్రభుత్వరంగ విద్యుదుత్పాదన సంస్థ ఎన్టీపీసీ ప్రకటించింది. ఇందులో రూ.250 కోట్లను ఎన్టీపీసీ ఇవ్వనుండగా.. రూ.7.5 కోట్లను సంస్థ ఉద్యోగులు (ఒక రోజు వేతనం) విరాళంగా ఇచ్చేందుకు ముందుకొచ్చారు. మరో రూ.11 కోట్లను కరోనా నియంత్రణ చర్యల కోసం ఖర్చు చేయనున్నట్లు ఎన్టీపీసీ ప్రకటించింది.
ఆర్థిక సేవల సంస్థ హెచ్డీఎఫ్సీ గ్రూప్.. రూ.150 కోట్లు విరాళం ప్రకటించింది.
ఇప్పటికే రూ.101 కోట్ల విరాళం ఇచ్చిన వేదాంత.. మరో రూ.100 కోట్ల విరాళం ప్రకటించింది. సంస్థ ఉద్యోగులు కూడా ఒక రోజు వేతానాన్ని విరాళంగా ఇచ్చేందుకు ముందుకొచ్చినట్లు వేదాంత ఇది వరకే ప్రకటించింది.
మరో ఆర్థిక సేవల సంస్థ శ్రీరామ్ గ్రూప్ కూడా పీఎం కేర్స్‌కు రూ.10 కోట్లు విరాళం ఇచ్చింది. ఆల్ కార్గొ సంస్థ మహారాష్ట్ర ముఖ్యమంత్రి నిధులకు రూ. కోటి విరాళంగా ప్రకటించింది.