కరోనాను ఎదుర్కొనేందుకు దేశవ్యాప్తంగా పలు సంస్థలు తమ దాతృత్వాన్ని చాటుతున్నాయి. తాజాగా జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ కరోనాపై పోరుకు రూ.100 కోట్లు పీఎం కేర్స్‌కు విరాళం ప్రకటించింది.
తమ ఉద్యోగులు కూడా కనీసం ఒక రోజు వేతనాన్ని విరాళంగా ఇచ్చేందుకు ముందుకొచ్చారని తెలిపింది.
వైద్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ కవచాలు, రోగులకు కృత్రిమ శ్వాస అందించి తగిన చికిత్స చేయడానికి అవసరమైన పరికరాలు, పరీక్షల సంఖ్య పెంచడానికి అనువైన టెస్టింగ్ కిట్ల కోసం ప్రత్యేక నిధులు కేటాయించింది ఈ సంస్థ. సహాయక చర్యల్లో భాగంగా ఆస్పత్రులపై ఒత్తిడి తగ్గించేందుకు జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌లోని కంపెనీలకు వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్లాంట్లు, కార్యాలయాలను ఐసోలేషన్ వార్డులుగా మారుస్తున్నట్లు పేర్కొంది.
"ప్రస్తుత పరిస్థితిని నిరంతరం అంచనా వేస్తున్నాం. కొవిడ్-19పై పోరాటంలో ప్రభుత్వానికి అన్నివిధాలుగా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. పరిస్థితిని బట్టి భవిష్యత్తులో మరింత సాయం చేస్తాం" -సజ్జన్ జిందాల్, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఛైర్మన్
జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌లో స్టీల్, ఎనర్జీ, సిమెంట్, స్పోర్ట్స్, మౌలిక సదుపాయాలు, పెయింట్స్ ఉత్పత్తి సంస్థలు ఉన్నాయి.