ఐటీ రంగంలోని పెద్ద కంపెనీలు, స్టార్టప్‌లు, సర్వీస్ ప్రొవైడర్లు అత్యవసరంగా టెక్ నిపుణుల నియామకం కోసం ఎదురు చూస్తున్నాయి. కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చాలా వ్యాపార సంస్థలు డిజిటల్ వైపు అడుగులు వేస్తుండటం రోజురోజుకూ పెరుగుతోంది. దాంతో ఐటీ సేవలకు భారీగా గిరాకీ ఏర్పడుతోంది. ప్రధానమైన పలు ఐటీ కంపెనీల్లో వేలాది కొలువులు నిపుణుల కోసం ఎదురు చూస్తున్నాయి. అంతేకాదు, ఆయా కంపెనీలు అర్హులైనవారికి పెద్దమొత్తంలో జీతాలను కూడా పెంచనున్నాయని తెలుస్తోంది.
నిపుణుల కొరత ఏర్పడిన విభాగాలు!
ఫుల్ స్టాక్ డెవలపర్స్, డేటా ఇంజినీర్స్, రియాక్ట్ నేటివ్ డెవలపర్స్, డెవలపర్ ఆప్స్/ సైట్ రిలయబిలిటీ ఇంజినీరింగ్, బ్యాక్ ఎండ్ ఇంజినీర్స్, మెషీన్ లెర్నింగ్ సేవల్లో కొత్త ఉద్యోగాలకు భారీగా అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆయా రంగాల్లో పనిచేస్తున్నవారికి గత ఏడాదికంటే జీతాలు కూడా సుమారు 25 శాతం వరకు పెరిగాయి. అలాగే గత కొన్ని నెలలుగా ఉద్యోగావకాశాలు వృద్ధి చెందుతున్నాయి. ఇప్పుడు ప్రపంచంలో దాదాపు అన్ని వాణిజ్య సముదాయాలు డిజిటల్ వైపు అడుగులు వేస్తుండటం గమనార్హం. అందుకే ఐటీలో మళ్లీ బూమ్ కనిపిస్తోంది.
'ఆర్థికంగా మళ్లీ కోలుకోవాలంటే టెక్నాలజీతోనే సాధ్యం. ముఖ్యంగా కొవిడ్ మహమ్మారి ప్రబలడం వల్ల పరిశ్రమలన్నీ ఉన్నపళంగా భారీ మార్పులకు శ్రీకారం చుట్టాయి. పనిచేసే పద్ధతులు కూడా చాలా వేగంగా మార్పునకు గురవుతున్నాయి' అని విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ చెప్పారు.
బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఎక్స్ ఫీనో అనే ఐటీ ఉద్యోగుల నియామకం చేపట్టే సంస్థ ప్రకారం దేశంలో దాదాపు 70 వేలమంది ఐటీ నిపుణుల అవసరం ఉంది. పైగా యాభై శాతం జీతం కూడా అదనంగా ఇచ్చి నియామకాలు చేపట్టేందుకు పలు ఐటీ సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. ప్రపంచంలోనే టాప్ ఐటీ సంస్థల్లో ఒకటైన యాక్సెంచర్‌లో గత ఏడాది 3వేల ఐటీ నిపుణుల అవసరం ఏర్పడింది. ఇప్పుడు అది 30 వేలకు పెరిగింది.
ప్రతిభావంతుల కోసం యుద్ధమే!
ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ గత ఫిబ్రవరిలో ఓ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ 'ఇక ఐటీలో ప్రతిభావంతుల కోసం యుద్ధం మొదలవుతుంది' అన్నారు. అంతర్జాతీయ ఐటీ దిగ్గజం కాగ్నిజంట్ కంపెనీ తమ వద్ద నిపుణుల కొరత ఏర్పడటం వల్ల కొన్ని ప్రాజెక్టులను కోల్పోవాల్సి వచ్చిందని తెలియజేసింది. ఇప్పటికే దాదాపు రెండున్నర లక్షలకు పైగా ఐటీ ఉద్యోగులు ఇందులో పనిచేస్తున్నారు.
దేశీయ టెక్ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్ కూడా రానున్న రోజుల్లో భారీగా నియామకాలు ఉంటాయని సంకేతాలు ఇచ్చింది. 2020-21లోనూ నియామాకాలు చేపట్టినట్లు తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం నియమించుకున్న ఉద్యోగుల్లో 40 శాతం మంది కొత్త వారు, 60 శాతం మంది అనుభవమున్నారని పేర్కొంది.
టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో తమ ఉద్యోగులకు ఒకే ఏడాదిలో రెండో విడత జీతాలను పెంచుతామని ఇదివరకే ప్రకటించాయి. ఉద్యోగులు వేరే కంపెనీకి మారకుండా అడ్డుకునేందుకు జీతాలు పెంచక తప్పడం లేదు. అలాగే పెద్ద మొత్తంలో బోనస్‌లు కూడా ఇచ్చాయి. గత మార్చిలో కాగ్నిజంట్ బోనస్‌లు ఇవ్వడం సహా భారీగా పదోన్నతులను ప్రకటించింది. అలాగే ఐటీ కంపెనీలన్నీ ఒకవైపు కొత్తవారికి భారీగా అవకాశం ఇస్తూనే, మరోవైపు తమ వద్ద ఉన్న సిబ్బందికే మరింత శిక్షణనిచ్చి, వారిలోని నైపుణ్యాలను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాయి.
ఇవీ చదవండి: