ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ (కొవిడ్-19) విషయంలో వ్యాధి నిర్ధరణ పరీక్షలు పెద్ద సవాలుగా మారింది. పరీక్షల ఫలితాలు రావడానికి చాలా వ్యవధి పడుతోంది. పైగా అవసరాలకు తగ్గట్లుగా పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి. దీనికి ప్రధాన కారణం వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసే కిట్లు (టెస్టింగ్ కిట్స్) తగినంతగా అందుబాటులో లేకపోవటమే. ఇది కేవలం మనదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఈ ఇబ్బంది కనిపిస్తోంది.
ప్రపంచ దేశాల్లోనూ...
అగ్రరాజ్యమైన అమెరికా నుంచి పలు ఐరోపా, ఆసియా దేశాలు టెస్టింగ్ కిట్ల లభ్యత లేక తల్లడిల్లిపోతున్నాయి. అందుకే కిట్లు తయారు చేసేందుకు ముందుకు వచ్చిన సంస్థలకు సత్వరం అనుమతులు ఇచ్చేందుకు ఆయా ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తొలుత దిగుమతి కిట్లపై అధికంగా ఆధారపడిన మనదేశం ఇప్పుడు దేశీయ తయారీని ప్రోత్సహించే సన్నాహాల్లో నిమగ్నమైంది. ఇందులో భాగంగా కొన్ని దేశీయ సంస్థలు అనుమతులు సంపాదిస్తున్నాయి. ఇప్పటికే రెండు సంస్థలకు టెస్టింగ్ కిట్ల తయారీకి ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) అనుమతి ఇచ్చింది. మరికొన్ని సంస్థల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. దీనివల్ల నెమ్మదిగా దేశీయంగా కిట్ల లభ్యత పెరిగి సత్వరం కొవిడ్-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించే పరిస్థితి వస్తుందని తెలుస్తోంది.
ధ్రువీకరణ ఉంటేనే...
మనదేశంలో తొలుత కేవలం అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ లేదా ఐరోపా సీఈ సర్టిఫికేషన్ ఉన్న కంపెనీలు తయారు చేసిన కిట్లనే కరోనా వ్యాధి నిర్ధారణకు వినియోగించాలని నిర్దేశించారు. అలాంటి అనుమతులు పొందిన సంస్థలు తక్కువగా ఉండటం, ఉన్న కొద్ది సంస్థలు కూడా పెద్ద సంఖ్యలో కిట్లు సరఫరా చేయలేకపోవటంతో కొరత ఏర్పడింది. ముఖ్యంగా అంతర్జాతీయంగా విమానాల రాకపోకలపై ఆంక్షలు పెరిగిపోవటం, ఇతర దేశాల్లో కొవిడ్-19 కేసుల సంఖ్య పెరగటంతో జర్మనీ నుంచి మనదేశానికి కిట్ల సరఫరా తగ్గింది. తదుపరి కొత్త కంపెనీలకు అనుమతులు ఇవ్వటం, దేశీయ తయారీని ప్రోత్సహించటంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దీనికి అనుగుణంగా ఐసీఎంఆర్ సారథ్యంలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవీ), సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీఓ) కొత్త దేశీయ, విదేశీ సంస్థల ప్రతిపాదనలను పరిశీలించి అనుమతులు ఇవ్వటం మొదలుపెట్టాయి.
లభ్యత పెరుగుతోంది...
అనుమతులు లభించిన కంపెనీలు సత్వరం తయారీ చేపట్టి టెస్టింగ్ కిట్లను మార్కెట్లో విడుదల చేయటానికి సిద్ధమవుతున్నాయి. దీనివల్ల కొద్దిరోజులు అవసరాల మేరకు కిట్లు లభించే అవకాశం ఉన్నట్లు వైద్య, ఉపకరణాల తయారీ విభాగానికి చెందిన నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం మనదేశంలో కరోనా వ్యాధిని నిర్ధారించటానికి ఆర్‌టీ-పీసీఆర్ ప్రోబ్స్ పరకరాలను అమెరికా, జర్మనీ తదితర దేశాల నుంచి దిగుమతి చేసుకొని ప్రభుత్వ లేబొరేటరీల్లో వినియోగిస్తున్నారు. కానీ ఇప్పుడు 'యాంటీ-బాడీ ర్యాపిడ్ టెస్ట్' కిట్లు లభిస్తున్నాయి. దీనికి తోడు రక్త నమూనాతో అప్పటికప్పుడే పరీక్ష ఫలితాన్ని రాబట్టే కిట్లు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. దీనివల్ల కరోనా వైరస్ వ్యాధి నిర్ధరణ పరీక్షలను ఎంతో వేగంగా తక్కువ ఖర్చులో నిర్వహించగలిగే సానుకూలత కలగనుందని స్పష్టమవుతోంది.
మైల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్
మనదేశంలో కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షలకు అవసరమైన కిట్లు తయారు చేసేందుకు తొలిసారిగా పుణెకు చెందిన మైల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ అనుమతి సంపాదించింది. ఆర్‌టీ-పీసీఆర్ (రివర్స్ ట్రాన్‌స్క్రిప్షన్ పాలీమెరేస్ చైన్ రీ-యాక్షన్) పద్ధతిలో ఎంతో వేగంగా కరోనా నిర్ధారణ పరీక్షల నిర్వహణకు ఈ సంస్థ తయారు చేసే కిట్ వీలు కల్పిస్తుంది. సాధారణంగా పరీక్షా ఫలితాన్ని కనుక్కోవటానికి ఏడెనిమిది గంటల సమయం అవసరం కాగా, ఈ సంస్థ తాను తయారు చేసే కిట్‌ను ఉపయోగించి రెండున్నర గంటల్లోనే ఫలితాన్ని నిర్ధరించవచ్చని స్పష్టం చేస్తోంది. అంతేగాక ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఒక్కో కిట్ ధరలో నాలుగోవంతు ధరకే వీటిని అందించనున్నట్లు మైల్యాబ్ డిస్కవరీ పేర్కొంది. అంతేగాక పెద్ద సంఖ్యలో కిట్లు తయారు చేయటం కోసం ఈ సంస్థ పుణెలోని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనావాలా, ఏపీజీ ఛైర్మన్ అభిజిత్ పవార్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీనివల్ల త్వరలో వారానికి 1.5 లక్షల కిట్లు తయారు చేయగలమని మైల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ వెల్లడించింది.
'బైవన్' కిట్‌తో ఇంటిదగ్గరే పరీక్ష
బెంగళూరుకు చెందిన బైవన్ అనే జెనెటిక్ టెస్టింగ్ సేవల సంస్థ ఒక రక్తపు చుక్కను నమూనాగా తీసుకొని ఇంటిదగ్గరే కొవిడ్-19 వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసే కిట్‌ను ఆవిష్కరించింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ఈ కిట్ ద్వారా పరీక్షా ఫలితం 10 నిమిషాల్లోనే లభిస్తుంది. ఒక్కో కిట్‌ను రూ.2499 ధరకు ఈ సంస్థ విక్రయిస్తోంది. వారానికి 20 వేల కిట్లు సరఫరా చేయగల సామర్థ్యం తనకు ఉన్నట్లు బైవన్ వెల్లడించింది. ఇదేకాకుండా కరోనా వైరస్ వ్యాధి వచ్చే ప్రమాదం ఉందా... శరీరంలోని ఎటువంటి మూల కణాల వల్ల ఈ వైరస్ దాడి చేయగలుగుతుందనే పరీక్షలు నిర్వహించే మరో రెండు రకాల కిట్లను కూడా ఈ సంస్థ ఆవిష్కరించింది.
మరికొన్ని విదేశీ కంపెనీలు...
ఆర్‌టీ-పీసీఆర్ పద్ధతిలో కొవిడ్-19 నిర్ధరణ పరీక్షలు నిర్వహించే కిట్ల సరఫరాకు రెండు దక్షిణ కొరియా సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇదే కాకుండా 'యాంటీ-బాడీ ర్యాపిడ్ టెస్ట్' పద్ధతిలో కరోనా వైరస్ వ్యాధి నిర్ధరణ కిట్లు తయారు చేసే మరో 12 సంస్థలకు కూడా అనుమతి లభించింది. ఇందులో యూఎస్ కంపెనీలైన బయోమెడ్నామిక్స్, సీటీకే బయోటెక్, సింగపూర్ సంస్థ- సెన్సింగ్ సెల్ఫ్, పోలెండ్ సంస్థ బయోమాగ్జిమా మరో ఏడు చైనా కంపెనీలు ఉన్నాయి. మరికొన్ని కంపెనీల ప్రతిపాదనలు కూడా కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో ఉన్నాయి.
ఇదీ చూడండి: ఒక్కరి నుంచి వేల మందికి.. ఆ సూపర్ స్ప్రెడర్లు ఎవరు?