వాహన రంగంలో వృద్ధి రేటు పడిపోవటాన్ని సవాలుగా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. కొనుగోలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియలపై స్పష్టతనిచ్చారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.
విద్యుత్ వాహనాలు, బ్యాటరీలను ప్రోత్సహిస్తూ ఇస్తున్న ప్రభుత్వ ప్రకటనలతో సందేహాలు నెలకొన్నాయి. ఆటోమొబైల్ సంస్థలు కూడా అందుకు తగ్గట్టు వాహనాలను తయారు చేస్తున్నాయి. వీటిని తొలగిస్తున్నట్లు నిర్మల స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ సమయం పూర్తయ్యే వరకు రోడ్లపై తిరిగేందుకు అనుమతి ఉంటుందని తెలిపారు. అన్ని రకాల వాహనాలకు ఇది వర్తిస్తుందన్నారు.
"2020 మార్చి వరకు కొనుగోలు చేసే బీఎస్-4 వాహనాలు.. వాటి రిజిస్ట్రేషన్ సమయం పూర్తయ్యే వరకు రోడ్లపై తిరగవచ్చు. ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఏకకాల రిజిస్ట్రేషన్ రుసుం సవరణను 2020 జూన్ వరకు నిలిపివేస్తున్నాం. ఎలక్ట్రానిక్ (ఈవీ), ఇంధన ఆధారిత వాహనాలు(ఐసీవీ) రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయి. "
-నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి
వాహన రంగం మెరుగైన వృద్ధి సాధించేందుకు ప్రభుత్వ విభాగాల్లో కొత్త వాహనాలను కొనుగోలు చేస్తామని తెలిపారు నిర్మల. పాత వాహనాల రిప్లేస్మెంట్ ద్వారా కొత్తవాటిని కొనుగోలు చేసేందుకు అనుమతి ఇస్తామన్నారు. ఫలితంగా వాహన రంగ సంస్థలకు డిమాండ్ పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి:లైవ్: మాంద్యంపై యుద్ధానికి కేంద్రం బహుముఖ వ్యూహం