జమ్ము కశ్మీర్లో పెట్టుబడి కార్యక్రమాలకు సహకరిస్తామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు హామీ ఇచ్చింది భారత పరిశ్రమల సమాఖ్య- సీఐఐ.
ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన వివిధ అంశాలపై సీఐఐ సభ్యులతో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ దిల్లీలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న కోటక్ మహీంద్ర ఎమ్డీ, సీఈఓ ఉదయ్‌కోటక్.. దేశ ఆర్థికవ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందాలని తాము కోరుకుంటున్నామని తెలిపారు.
"జమ్ముకశ్మీర్‌లో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని మేము కోరుకుంటున్నాము. ఈ కేంద్రపాలిత ప్రాంతంలో పెట్టుబడులు పెంపొందింపజేయడానికి సహకారం అందిస్తామని ఆర్థికమంత్రికి పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) హామీ ఇచ్చింది."
-ఉదయ్ కోటక్, సీఐఐ అధ్యక్షుడు
'సమావేశంలో పారిశ్రామికవేత్తలు వివిధ రంగాలపై వ్యక్తం చేసిన అభిప్రాయాలను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఎంతో విశాల దృక్పథంతో, శ్రద్ధగా విన్నారు. సీఐఐ సభ్యుల సలహాలను పరిశీలిస్తామని సీతారామన్ హామీ ఇచ్చారు' అని ఉదయ్ కోటక్ వెల్లడించారు.
ఎఫ్‌పీఐలతో భేటీ
మూలధన మార్కెట్లు, ఆర్థికవ్యవస్థ పురోభివృద్ధికై విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులతో (ఎఫ్‌పీఐ) శుక్రవారం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ భేటీకానున్నారు.
చారిత్రక నిర్ణయం
జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను ఇచ్చే ఆర్టికల్ 370ని ఇటీవలే కేంద్రప్రభుత్వం రద్దు చేసింది. రాష్ట్రాన్ని జమ్ముకశ్మీర్, లద్ధాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది.
ఇదీ చూడండి: ఐబీసీ సవరణలు సముచితమే: సుప్రీంకోర్టు