ఆరు నెలలుగా కొవిడ్-19 సంక్షోభం.. పర్యవసానంగా వేతన కోతలు, ఉద్యోగాల తొలగింపు.. ఈ పరిస్థితుల్లోనే తెలుగు రాష్ట్రాలను భారీవర్షాలూ వణికించాయి. ఇక దసరా-దీపావళి పండగ అమ్మకాలు ఎలా ఉంటాయనే అనిశ్చితి వ్యాపారుల్లో నెలకొంది.. అయితే ఇ-కామర్స్ పోర్టళ్లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు తోడు రిటైల్ విక్రయశాలలూ భారీగా ఆఫర్లు, బహుమతులు ఇస్తూ కొనుగోలుదార్లను భారీగానే ఆకర్షిస్తున్నాయి. గతేడాది స్థాయిలో, అంతకంటే ఎక్కువగానే అమ్మకాలు జరుగుతున్నాయని.. అయితే డిమాండ్ ఉన్న మోడళ్ల సరఫరా అంతగా లేకపోవడానికి తోడు రుణాల జారీ నెమ్మదించడం కొంత ఇబ్బంది పెడుతోందని సెల్‌ఫోన్, ఎలక్ట్రానిక్ పరికరాల విక్రేతలు చెబుతున్నారు.
దసరా-దీపావళి పండగల సీజన్ అంటేనే ఉద్యోగులకు బోనస్‌లు.. వాటితో ఇళ్లలోకి కావాల్సిన పరికరాల కొనుగోలు ఎక్కువగా జరుగుతుంటుంది. ఈసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫరవాలేకున్నా, ప్రైవేటు సంస్థల ఉద్యోగులకు బోనస్ అందడం తగ్గిపోయింది. అయినా కూడా ఆన్‌లైన్ పోర్టళ్లతో పాటు విక్రయశాలల్లోనూ సెల్‌ఫోన్ అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం.. పిల్లలకు ఆన్‌లైన్ తరగతులే. దీంతోపాటు ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయడం కొనసాగడంగా చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఫీచర్‌ఫోన్లు కొనుగోలు చేసేవారూ గతంలో ఎక్కువగానే ఉండేవారు. అయితే పిల్లలు పాఠ్యాంశాలు అభ్యసించేందుకు ఇప్పుడు పెద్ద తెర ఉండే 4జీ స్మార్ట్‌ఫోన్ల కొనుగోళ్లే అత్యధికంగా జరుగుతున్నాయి. అందువల్ల సంఖ్యా పరంగా అమ్మకాలు కొంత తగ్గినా, విలువ పరంగా పెరిగినట్లు విక్రయసంస్థల సమాచారం. గతంలో సెల్‌ఫోన్ సగటు అమ్మకం రూ.7,000 వరకు ఉంటే, ఇప్పుడు రూ.10,000-15,000కు పెరిగిందని చెబుతున్నారు.
ఒకే ధర ఉండడంతో..
ఇ-కామర్స్ పోర్టళ్లతో పాటు సంప్రదాయ విక్రయశాలలకూ కంపెనీలన్నీ తమ మోడళ్లను అందచేయడమే కాక, దాదాపు ఒకే ధరలో విక్రయానికి సహకరిస్తున్నాయి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలూ ఆన్‌లైన్‌తో పాటు విక్రయశాలల్లోనూ కార్డులతో కొనుగోలు చేస్తే నగదు వెనక్కి, నెలవారీ వాయిదాల వీలు కల్పిస్తున్నాయి. ఇందుకు అదనంగా షోరూంల నిర్వాహకులు తప్పనిసరి బహుమతి/లక్కీడ్రా/స్క్రాచ్‌కార్డ్ ద్వారా కొనుగోలుదార్లకు నజరానాలు అందిస్తున్నాయి. కొనుగోలుదార్లకు లాయల్టీ పాయింట్లు జమచేస్తూ, వారితో బంధం తెగకుండా చూసుకునే విధానాన్ని మొబైల్ విక్రయసంస్థలూ అమలు చేస్తున్నాయి. మంచి రోజున వస్తువును ఇంటికి తెచ్చుకోవాలనుకునే వారు, ఆన్‌లైన్‌లో అయితే అందుకు వీలు కాదనే భావనతో, బహుమతి కూడా లభిస్తున్నందున విక్రయశాలలకు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. ట్యాబ్లెట్ పీసీల అమ్మకాలు చూస్తే గతేడాది కంటే కొన్ని రెట్లు అధికంగా జరుగుతున్నాయి. టీవీలు, రిఫ్రిజరేటర్లు, వాషింగ్‌మెషీన్ల వంటి ఎలక్ట్రానిక్ గృహోపకరణాల కొనుగోలులోనూ ఇదే ధోరణి. హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకులు 10 శాతం క్యాష్‌బ్యాక్ పథకాన్ని అమలు చేస్తున్నాయి.
- బిగ్‌సి సీఎండీ బాలుచౌదరి: గతేడాది కంటే 10 శాతం అధిక విలువ మేర విక్రయాలు చేస్తున్నాం. ప్రతి కొనుగోలుపై క్యాష్‌పాయింట్లు జతచేరతాయి. ఈ రూపేణ గరిష్ఠంగా 5000 పాయింట్లు అంటే రూ.1500 తగ్గింపు లభిస్తుంది. ఇప్పటివరకు మా దగ్గర కొనుగోళ్లు జరిపిన 25 లక్షల కొనుగోలుదార్ల ఖాతాల్లో 1000 పాయింట్లు జమ చేశాం. అదనంగా కచ్చిత బహుమతి, లక్కీడ్రాలో రోజుకు ఒకరు రూ.లక్ష చొప్పున, 100 రోజుల్లో రూ.కోటి గెలుచుకునే వీలుంది.
- లాట్ ప్రతినిధి: స్మార్ట్‌ఫోన్లపై గృహోపకరణాలు బహుమతిగా అందిస్తున్నాం. 6000 క్యాష్‌పాయింట్ల వరకు పొందవచ్చు. కార్డులపై నగదు వెనక్కి ఆఫర్లున్నాయి.
- బి న్యూ సీఎండీ బాలాజీ: తెలుగు రాష్ట్రాల్లోని 81 విక్రయశాలల్లో ఈఎంఐ కొనుగోలుపై రూ.3500 వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తున్నాం. 0 డౌన్‌పేమెంట్, 0% వడ్డీ, 0 ప్రాసెసింగ్ ఛార్జీలతో విక్రయిస్తున్నాం. క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి సంస్థలు సులభంగానే రుణాలిస్తున్నాయి. గతేడాది 60% నగదు కొనుగోళ్లు అయితే, ఇప్పుడు 55% వరకు క్రెడిట్‌పై తీసుకుంటున్నవి ఉన్నాయి.
- హ్యాపీమొబైల్స్ సీఎండీ పవన్: రూ.5 కోట్ల విలువైన బహుమతులు ఇస్తున్నాం. రుణంపై తీసుకునేవారు 30 శాతం వరకు ఉంటున్నారు. అయితే క్రెడిట్‌స్కోర్ వల్లే జారీ కొంత ఆలస్యమవుతోంది. 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్ ఇస్తున్నాం. ప్రతి కొనుగోలుపైనా కచ్చితమైన, ఆకర్షణీయ బహుమతి వినియోగదారులకు చేరుతోంది.
- సెలెక్ట్ మొబైల్స్ సీఎండీ వై.గురు: కొన్ని ఉత్పత్తులపై 70 శాతం వరకు రాయితీ ఇస్తున్నాం. శామ్‌సంగ్ ఫోన్లపై 6 నెలల పాటు సన్ నెట్‌వర్క్ యాప్ కనెక్షన్ ఉచితం. స్మార్ట్‌ఫోన్ల కొనుగోలుపై టేబుల్‌టాప్, వాల్‌మౌంటింగ్ శానిటైజర్ డిస్పెన్సర్లు, గన్‌మెషీన్ ఉచితంగా ఇస్తున్నాం. రూ.4999 నుంచి మైక్రోమ్యాక్స్ టీవీలు విక్రయిస్తున్నాం.
- సెల్‌పాయింట్ ఎండీ మోహన్: విదేశాల నుంచి దిగుమతి అయ్యే, గిరాకీ అధికంగా ఉన్న కొన్ని మోడళ్లను కంపెనీలు తక్కువగా సరఫరా చేస్తున్నాయి. రుణాలపై తీసుకుంటున్న వారి సంఖ్య 60 శాతం నుంచి 30 శాతానికి తగ్గింది. స్క్రాచ్‌కార్డుపై రూ.50 నుంచి లక్ష వరకు గెలుపొందే వీలుంది.
- బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఎండీ కరణ్: సంక్రాంతి పండుగ వరకు రూ.కోటి మొత్తాన్ని లక్కీడ్రాలో గెలుపొందే వీలు కల్పించాం. లాటరీలో 25 కార్లు కూడా గెలుపొందొచ్చు. రూపాయి డౌన్‌పేమెంట్‌తో మిగిలింది వాయిదాల్లో కొనుగోలు చేసుకునే వీలుంది. 50 శాతం మంది రుణాలపై కొంటున్నారు. టాబ్లెట్ పీసీలు, ల్యాప్‌టాప్‌ల సరఫరాలో ఆటంకాలు ఉంటున్నాయి. టీవీలు, రిఫ్రిజరేటర్లు, వాషింగ్‌మెషీన్ల అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వివిధ ఉత్పత్తులపై బహమతులున్నాయి.
- సోనోవిజన్ ఎండీ భాస్కరమూర్తి: ప్రతి రూ.2000 కొనుగోలుపై స్క్రాచ్‌కార్డు ద్వారా రూ.100 నుంచి రూ.లక్ష వరకు వెంటనే గెలుపొందొచ్చు. 30 నెలల వరకు ఈఎంఐ సదుపాయం, కచ్చితంగా చెల్లించేవారికి 1 నెల వాయిదా సంస్థే చెల్లించే పథకం ఉంది. వడ్డీలేని సులభ వాయిదాలతో పాటు కార్డులపై నగదు వెనక్కి లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోని షోరూమ్‌లలో 9 కార్లు గెలుచుకునే వీలు. హైదరాబాద్ కొనుగోలుదార్లకు సంక్రాంతి పండుగ సమయంలో కార్లు పొందే వీలు.
మారటోరియం ఎంచుకున్న వారికే కష్టాలు
కొవిడ్ సంక్షోభం వల్ల రుణ మారటోరియంను బ్యాంకులు అమలు చేశాయి. అది ఎంచుకున్న వారి క్రెడిట్ రేటింగ్‌పై ప్రభావం పడుతోంది. ఫలితంగా ఇప్పుడు ఆర్థిక సంస్థలు కొత్తగా రుణాలివ్వలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో పిల్లల చదువు కోసం పెద్ద తెర కలిగిన స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసేందుకు, రుణ రేటింగ్ లేని వారిలో కొందరు బంగారాన్ని సైతం తాకట్టు పెడుతున్న ఘటనలు చూస్తున్నామని ఒక దిగ్గజ విక్రయసంస్థ నిర్వాహకులు చెప్పారు.
ఇవీ చూడండి: దీపావళికి ఫ్లిప్‌కార్ట్ మరో సేల్