2025లోపు భారత్లో 10 లక్షల ఉద్యోగాలు సృష్టించడమే తమ లక్ష్యమని అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ ప్రకటించారు. భారత్లో 1 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతున్నట్లు బెజోస్ ప్రకటనపై కేంద్ర వాణిజ్యమంత్రి పీయూష్ గోయల్ చేసిన విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో బెజోస్ తాజా ప్రకటన ప్రాధాన్యం సంతరించకుంది.
"భారత్లో వచ్చే ఐదేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు సృష్టించాలని అమెజాన్ భావిస్తోంది. ఐటీ, నైపుణ్య అభివృద్ధి, కంటెంట్ క్రియేషన్, రిటైల్, లాజిస్టిక్స్ నెట్వర్క్, తయారీ రంగాల్లో పెట్టుబడులు పెడతాం. ఫలితంగా లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. " - జెఫ్ బెజోస్, అమెజాన్ సీఈఓ
భారత్లో గత ఆరేళ్లలో అమెజాన్ సృష్టించిన ఏడు లక్షల ఉద్యోగాలకు ఇవి అదనం అని బెజోస్ స్పష్టం చేశారు.
2022 నాటికి
2022 నాటికి 400 మిలియన్ల గ్రామీణ, పట్టణ వయోజనులకు ఉద్యోగ కల్పన, నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి భారత ప్రభుత్వం నిర్ణయించింది. దీనిని అమెజాన్ స్వాగతించింది. అమెజాన్ కొత్త పెట్టుబడులతో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఇంజినీరింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, కంటెంట్ క్రియేషన్, కస్టమర్ సపోర్ట్ సహా పలు రంగాల్లో ప్రతిభావంతులైన యువతకు ఉపాధి లభిస్తుందని అభిప్రాయపడింది.
గోయల్ విమర్శలు
భారత్ పర్యటనకు వచ్చిన బెజోస్.. ఇక్కడ 1 బిలియన్ డాలర్ల (సుమారు రూ.7,000 కోట్లు) మేర పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించారు. బెజోస్ ప్రకటనపై కేంద్ర వాణిజ్యమంత్రి పీయూష్ గోయల్ పెదవి విరిచారు. ఈ కామర్స్ దిగ్గజం భారీ రాయితీలు కల్పిస్తున్నా లాభాలు ఎలా ఆర్జిస్తోందని ప్రశ్నించారు.
ఇదీ చూడండి: 'టెలికాం సంస్థలు ఆ డబ్బును విద్యా నిధికి ఇవ్వాల్సిందే'