Air India: ఎయిర్ఇండియాను ఆర్థికంగా బలోపేతం చేయడం సహా ప్రపంచంలోనే అత్యంత అధునాతన సాంకేతికతతో కూడిన విమానయాన సంస్థగా టాటా గ్రూపు తీర్చిదిద్దుతుందని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ తెలిపారు. ఇప్పుడు ఉపయోగిస్తున్న విమానాలను నవీకరించి, మరిన్ని కొత్త వాటిని తీసుకొస్తామని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన చెప్పారు. "విమానయాన సంస్థ తిరిగి అత్యుత్తమంగా మారాలంటే వ్యవస్థీకృతంగా చాలా మార్పులు అవసరం. నాకు తెలిసి మునుపెన్నడూ లేనంత మార్పులు మీరు చూసే అవకాశం ఉంద"ని తెలిపారు. దేశీయంగాను, అంతర్జాతీయంగాను మరిన్ని గమ్యస్థానాలకు ఎయిరిండియా కార్యకలాపాలు విస్తరిస్తాయని, ప్రపంచంలోని ప్రతి ఒక్క ప్రాంతానికి భారత్ నుంచి సర్వీసులు నడపాలన్నది సంస్థ లక్ష్యమని అన్నారు. ఎయిర్ఇండియా చేరికతో 130 కోట్ల మంది భారతీయుల అభిలాషలకు ప్రాతినిథ్యం వహించే అవకాశం టాటా గ్రూపునకు కలిగిందని తెలిపారు.
ఆ నాలుగు అంశాలే కీలకం..
ఎయిర్ఇండియాకు సంబంధించి నాలుగు కీలక అంశాలపై కొత్త యాజమాన్యం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని చంద్రశేఖరన్ చెప్పారు. అవి.. వినియోగదారుల సేవలపరంగా అత్యుత్తమంగా తీర్చిదిద్దడం, ప్రపంచంలోనే అత్యంత అధునాతన సాంకేతికతతో కూడిన విమానయాన సంస్థగా మార్చడం, విమానాల నవీకరణ- కొత్త విమానాలను చేర్చడం, విమానంలోనూ, బయటా ఆతిథ్య సేవలు అని ఆయన చెప్పారు.
అధునాతన సాంకేతికత వినియోగంపై స్పందిస్తూ.. యాప్‌లు, వెబ్‌సైట్, మొబైల్ చానల్, సోషల్ మీడియా, టాటా ఎన్‌ఈయూ యాప్.. ఇలా పలు డిజిటల్ మార్గాల ద్వారా ఎయిరిండియా సేవలను వినియోగదారులకు అందుబాటులో తెస్తామని చెప్పారు.
"విశ్వసనీయత, నాణ్యతతో కూడిన సేవలను, ఉత్పత్తులను అందిస్తుందని శతాబ్దకాలంగా టాటా గ్రూపుపై వినియోగదారులకు ఓ అభిప్రాయం ఉంది. జాప్యానికి తావు లేకుండా అనుకున్న సమయానికే ఎయిర్ఇండియా విమానాల రాకపోకలు ఉంటాయనే నమ్మకాన్ని ముందు కల్పించాల"ని ఆయన అభిప్రాయపడ్డారు.
పెద్ద లక్ష్యం సాకారం కావాలంటే..
ఏదేని సంస్థ విజయవంతం కావాలంటే ఆర్థికంగా పరిపుష్ఠం కావాల్సిన అవసరం ఉందని చంద్రశేఖరన్ చెప్పారు. ఎయిర్ఇండియాను కూడా బలోపేతం చేయడంపై కొత్త యాజమాన్యం దృష్టి సారించాలని సూచించారు. అయితే ఈ లక్ష్యాన్ని సాధించడం కష్టమేనన్న విషయం తనకు తెలుసునని వెల్లడించారు. ఒక పెద్ద లక్ష్యం సాకారం కావాలంటే.. ప్రతీ విభాగంలోని ప్రతీ ఒక్కరూ కలిసి తమ తమ లక్ష్యాలను సాధించే దిశగా ప్రయత్నించాలని చెప్పారు.
ఇదీ చూడండి: Air India CEO: ఎయిర్ ఇండియా కొత్త సీఈఓగా ఇల్కర్