నేపాల్‌లోని సింధుపాల్‌చౌక్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు రోడ్డుపై నుంచి అదుపుతప్పి పక్కనే ఉన్న లోయలో పడింది. ఈ దుర్ఘటనలో 14 మంది దుర్మరణం పాలయ్యారు.
పోలీసుల వివరాల ప్రకారం.. సింధుపాల్‌చౌక్ జిల్లాలో కాలిన్‌చౌక్ మందిరం నుంచి ఆదివారం ఉదయం 40 మంది యాత్రికులతో ఓ బస్సు బయలుదేరింది. డోలాఖా ఖాదీచౌర్- జిరి రోడ్డు మార్గంలో బస్సు అదుపు తప్పి రోడ్డుపై నుంచి 500 మీటర్ల లోతులో పడింది. 14 మంది మృతి చెందారు. మరో 19 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. బస్సులో ప్రయాణిస్తున్న వారంతా కాలిన్‌చౌక్ మందిరం దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
స్థానికుల సాయంతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు పోలీసులు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.