తెదేపా అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో డీఎంకే పార్టీనేత దురైమురుగన్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ చెన్నైలో డీఎంకే అధినేత స్టాలిన్‌ను కలిసిన మరుసటి రోజే ఆ పార్టీ సీనియర్ నేత చంద్రబాబుతో భేటీ అవ్వడం ఆసక్తికరంగా మారింది. కుటుంబ సభ్యులతో సహా ఏపీ సచివాలయానికి వచ్చిన దురై మురుగన్ 30 నిమిషాలపాటు చంద్రబాబుతో సమావేశమయ్యారు.
జాతీయ స్థాయిలో 21 పార్టీల మహాకూటమిని సమన్వయం చేస్తున్న తెదేపా అధినేత చంద్రబాబుతో డీఎంకే పార్టీ సీనియర్ నేత దురై మురుగన్ భేటీ అయ్యారు. ఇరువురి మధ్య తాజా రాజకీయ పరిణామాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై డీఎంకే అధినేత స్టాలిన్ వైఖరిని చంద్రబాబుకు దురై స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. కేసీఆర్ ఆలయాల దర్శనాలకే తమిళనాడు వచ్చారని రాజకీయాలపై తనతో ఏమీ చర్చించలేదంటూ స్టాలిన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో దురై మురుగన్- చంద్రబాబుల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని మోదీని ఎదిరించి నిలబడటంలోనూ, భాజపాయేతర పార్టీలను ఒకే వేదికపైకి తీసుకురావడంలో చంద్రబాబు నాయుడి ముద్ర స్పష్టంగా కనిపిస్తోందని దురై మురుగన్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.
ఫెడరల్ ఫ్రంట్‌ను బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ భువనేశ్వర్ వెళ్లి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో భేటీ అయ్యారు.. ఆ మరుసటి రోజే ఒడిశా ఎంపీ సౌమ్య రంజన్ పట్నాయక్ చంద్రబాబుతో సమావేశమై సంఘీభావం ప్రకటించటం వంటి అంశాలూ నేతల మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. చంద్రబాబు ప్రయత్నాలకు స్టాలిన్ సానుకూలంగా ఉంటారని దురై మురగన్ స్పష్టం చేసినట్టు సమాచారం. మే 23న ఫలితాల అనంతరం మహా కూటమి సమావేశాలకు సంబంధించి భేటీలో చర్చకు వచ్చింది.
ప్రచారానికి చంద్రబాబుకు ఆహ్వానం
దురైమురుగన్ కుమారుడు కతిర్ ఆనంద్ తమిళనాడులోని వేలూరు నుంచి డీఎంకే తరఫున లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. ఆ నియోజకవర్గంలో ఏప్రిల్ 18న జరగాల్సిన ఎన్నికను భారీగా నగదు దొరికిందన్న కారణంతో ఎన్నికల సంఘం రద్దు చేసింది. తిరిగి జరిగే ఆ ఎన్నికల్లో తన తరఫున ప్రచారంలో పాల్గొనాల్సిందిగా కతిర్ ఆనంద్ చంద్రబాబును కోరారు.
ఇదీ చదవండి: 'కలిసొస్తే ఎర్రకోటపై పాగావేద్దాం'..