వైశాఖ శుద్ధ తదియనే అక్షయ తృతీయ పేరుతో హిందువులు, జైనులు జరుపుకుంటారు. అక్షయం అంటే ఎన్నటికీ తరగనిది అని అర్థం. ఈ రోజు బంగారం కొని లక్ష్మీదేవికి అలంకరించి పూజిస్తారు. ఇలా చేస్తే ఇల్లు సిరిసంపదలతో తులతూగుతుందని భక్తుల నమ్మకం. అయితే, బంగారం కొనాలనే ప్రచారం ఎక్కువగా వినిపిస్తున్నా అప్పోసొప్పో చేసి ఈ పండుగ జరుపుకోకూడదు. గుర్తుంచుకోండి... ఈ రోజు అప్పు చేస్తే అది అక్షయమవుతుంది. అంటే ఎన్నటికీ తీర్చలేం.
ఆంధ్రప్రదేశ్లోని సింహాచలంలో వరాహ లక్ష్మీ నరసింహ స్వామి నిజరూప దర్శనం కూడా అక్షయ తృతీయ నాడు మాత్రమే లభిస్తుంది. ఏడాదంతా చందనపు పూతతో స్వామిని కప్పి ఉంచుతారు. చార్‌దామ్ యాత్రలో ముఖ్యమైన బదరీనాథ్ ఆలయాన్ని చలికాలం తర్వాత తిరిగి తెరిచేది కూడా ఈరోజే. శ్రీక్షేత్రం పూరిలో జగన్నాథుడి రథ నిర్మాణానికి కూడా అంకురార్పణం జరిగింది ఇవాళే.
అక్షయ తృతీయ ప్రాముఖ్యత
- పరశురాముని జన్మదినం
- పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం
- త్రేతాయుగం మొదలు
- శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకున్న రోజు
- వ్యాస మహర్షి మహా భారతాన్ని రాయడం మొదలుపెట్టిన రోజు
- సూర్య భగవానుడు అజ్ఞాతవాసములో ఉన్న పాండవులకు అక్షయపాత్ర ఇచ్చిన రోజు
- అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిన రోజు
- ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుని బారినుండి కాపాడిన రోజు.
- శివుని జటాజూటం నుంచి భూలోకానికి గంగ చేరిన సుదినం.
వైశాఖ శుద్ధ తదియ నాడు చేసే ఏ వ్రతమైనా, జపమైనా, హోమమైనా, దాన ధర్మాలేవైనా దాని ఫలితము అక్షయమవుతుంది. అలాగే పుణ్య కార్యాచరణ వల్ల వచ్చే ఫలితం అక్షయమైనట్లే, పాపకార్యాచరణ వల్ల వచ్చే ఫలితం కూడా అక్షయముగానే అభివర్ణిస్తారు. ఉష్ణతాపం నుంచి ఉపశమనం కలిగించే మజ్జిగ, పానకం, చెప్పులు, గొడుగు, మామిడి పండ్లు, వస్త్రాలు, గంధం దానం చేస్తారు. ఎండలు మండిపోయే వైశాఖంలోని ఈ పుణ్యదినాన ఎవరి గొంతు చల్లబరచినా, ఎవరికైనా కాస్త దానం చేసినా ఐశ్వర్యం సిద్ధిస్తుంది.
ఇదీ చదవండిః జోర్దార్గా అక్షయ తృతీయ పసిడి కొనుగోళ్లు