తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణిపై జరిగిన కృష్ణా యాజమాన్య బోర్డు (krishna river management board -krmb) సమావేశం నుంచి రాష్ట్ర ప్రభుత్వం వాకౌట్ చేసింది. ఐదుగంటలపాటు సుదీర్ఘంగా సాగిన సమావేశం ముగిసింది. జల విద్యుదుత్పత్తి విషయంలో ఛైర్మన్ నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. సాగర్, కృష్ణా డెల్టా (krishna delta) అవసరాలకు అనుగుణంగానే విద్యుదుత్పత్తి ఉండాలన్న ఛైర్మన్ నిర్ణయాన్ని సర్కారు తప్పుపట్టింది. కేఆర్ఎంబీ సమావేశం ముగిసిన అనంతరం... కృష్ణా, గోదావరి బోర్డుల ఉమ్మడి సమావేశం ప్రారంభమయ్యాయి. గెజిట్ నోటిఫికేషన్ (gazette notification) అమలు కార్యాచరణపై చర్చిస్తున్నాయి. ఉమ్మడి సమావేశానికి తెలంగాణ, ఏపీ అధికారులు హాజరయ్యారు.
సమాన నిష్పత్తిలోనే..
కృష్ణా బోర్డు సమావేశంలో వాదనలు వినిపించిన జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ నీటిని సమాన నిష్పత్తిలో పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. హైదరాబాద్ జలసౌధలో కేఆర్‌ఎంబీ ఛైర్మన్ ఎం.పి.సింగ్ (KRMB CHAIRMAN MP SINGH) అధ్యక్షతన జరిగిన సమావేశానికి... ఏపీ, తెలంగాణ అధికారులు, ఇంజినీర్లు హాజరై కృష్ణా జలాల పంపిణీ, శ్రీశైలంలో జలవిద్యుదుత్పత్తి, గోదావరి జలాల మళ్లింపు సహా.. 13 అంశాలపై చర్చించారు.
తెలంగాణపై నిందలు..
ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల కేటాయింపులు.... తాత్కాలికమన్న రజత్ కుమార్ అవి కేవలం 2015-16 ఏడాదికి వర్తించేలా అంగీకారం కుదిరిందన్నారు. ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా ప్రాజెక్టులు పూర్తైనందున నీటి వినియోగం పెరిగిందని వివరించారు. సమాన నిష్పత్తిలో నీటి పంపిణీ విషయంలో రాజీపడేది లేదన్న రజత్‌కుమార్ సమాన వాటాపై కేఆర్ఎంబీ ఛైర్మన్ సత్వరమే నిర్ణయం తీసుకోవాలని కోరారు. శ్రీశైలంలో విద్యుదుత్పత్తి ఆపే ప్రసక్తే లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ కావాలనే అన్ని విషయాల్లోనూ కొర్రీలు పెడుతోందని ఆరోపించారు. కృష్ణా బేసిన్ (Krishna river basin) పరిధిలో లేని ప్రాంతాలకు నీటిని తరలిస్తూ తెలంగాణపై నిందలు వేస్తోందన్నారు. రాయలసీమ ప్రాజెక్టుపై (RAYALASEEMA LIFT IRRIGATION PROJECT) కేఆర్ఎంబీ ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
ఇదీచూడండి: Child At Pub: అసలు చిన్నారిని పబ్‌లోనికి ఎవరు తీసుకెళ్లారు..?