Yuva Galam Vijayotsava Sabha Today Live Updates:
7. 50 PM
ప్రజా చైతన్యం కోసం ఎన్టీఆర్ చైతన్యయాత్ర చేశారు
పాదయాత్రలు చేయడం ఈ దేశంలో కొత్తేమి కాదని టీడీపీ అధినేత అన్నారు. ప్రజా చైతన్యం కోసం దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చైతన్యయాత్ర చేశారని గుర్తు చేశారు. ఆ తర్వాత ఎన్నో రకాల యాత్రలు జరిగియాని ఆయన అన్నారు. కానీ, పాదయాత్రపై దండయాత్ర చేసిన సందర్భాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. తొలిసారి సైకో జగన్ పాలనలో దండయాత్రలు చూసినట్లు చంద్రబాబు విమర్శించారు.
విధ్వంస పాలనకు జగన్ నాంది పలికారు అని చంద్రబాబు ఆరోపించారు. జగన్‌కు ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. రాష్ట్రం వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్‌గా మారాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. అమరావతిని సర్వనాశనం చేసి మూడు ముక్కలాట ఆడారని విమర్శించారు. రుషికొండను బోడి గుండుగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం విల్లా కోసం 500 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టారని చంద్రబాబు వాపోయారు.
రాష్ట్రంలో ప్రతి రంగం పూర్తిగా దెబ్బతిందని, స్వార్థం కోసం రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధాల పునాదిపై నిర్మించిన పార్టీ వైసీపీ అని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా, రైల్వేజోన్ సాధిస్తామన్న హామీ ఏమైందని చంద్రబాబు ప్రశ్నించారు. మద్యపాన నిషేధం అమలు చేశాకే ఓట్లు అడుగుతానని ప్రతిపక్షంలో జగన్ చెప్పారని చంద్రబాబు గుర్తు చేశారు.
7.30 PM
మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు సీఎం జగన్‌ను
టీడీపీ అధినేత చంద్రబాబును అన్యాయంగా జైలులో పెడితే బాధ కలిగిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. కష్టాల్లో ఉన్నప్పుడు సాయంగా ఉండాలని అనుకున్నానని పవన్ స్పష్టం చేశారు. ఏదో ఆశించి టీడీపీకి మద్దతివ్వలేదని, 2024లో టీడీపీ - జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కచ్చితంగా మార్పు తీసుకువస్తామని, జగన్‌ను ఇంటికి పంపుతామని పవన్ అన్నారు. జగన్ ఎమ్మెల్యేలను మార్చుతున్నారని, మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదని సీఎం జగన్‌ను అంటూ పవన్ విమర్శించారు. ప్రజాస్వామ్యం అనే పదానికి జగన్‌కు విలువ తెలియదని మండిపడ్డారు. ఏదైనా మాట్లాడితే దూషిస్తారని దాడులు చేయిస్తారన్నారు.
తల్లి, చెల్లికి విలువ ఇవ్వని వ్యక్తి ఆడపడుచులకు ఏం గౌరవం ఇస్తారని పవన్ ఎద్దేవా చేశారు. ఒంటరి మహిళలు అన్యాయాలకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వారాహి యాత్రలో తనపై దాడులు చేశారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం మారాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీ భవిష్యత్తును నిర్దేశించే క్షణాలు ఇవేనని ప్రజలకు జనసేనాని పిలుపునిచ్చారు.
6.50PM
యువగళం ఎన్నో పాఠాలు నేర్పింది
యువగళం పాదయాత్ర ఎన్నో పాఠాలు నేర్పిందని లోకేశ్ వెల్లడించారు. పాదయాత్రలో అడుగడుగునా జగన్ విధ్వంసం కనిపించిందని ఆరోపించారు. రాజధానిని చంపి జగన్ రాక్షసానందం పొందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వరి, కొబ్బరి రైతులను, ఆక్వా రంగాన్ని నాశనం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రహదారులపై ఏర్పడిన గుంతల వల్ల రోడ్డు ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి నెలకొందని లోకేశ్ వాపోయారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం తప్ప ఒక్క ఇటుక వేయలేదని, విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అని గుర్తు చేశారు.
6.30 PM
ఇది నవశకం - ఇప్పుడే యుద్ధం మొదలైంది
ప్రస్తుతం నిర్వహిస్తున బహిరంగ సభ యువగళం ముగింపు సభ కాదని ఆరంభం మాత్రమేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఉధ్ఘాటించారు. ఇది నవశకమని, యుద్ధం మొదలైందని లోకేశ్ స్పష్టం చేశారు. తాడేపల్లి తలుపులు బద్ధలు కొట్టే వరకు యుద్ధం ఆగదని, ప్రజలు పాదయాత్ర చేస్తే పోరాటం అవుతుందని, రాక్షస పాలనలో పోరాటం చేస్తే విప్లవం అవుతుందని పేర్కొన్నారు.
యువగళం మనగళం, ప్రజాగళమని లోకేశ్ అన్నారు. బాంబులకే భయపడమని, పిల్ల సైకోలకు భయపడతామా అంటూ వ్యంగ్యస్త్రాలు విసిరారు. జగన్‌ది రాజారెడ్డి రాజ్యాంగం పొగరు అని, లోకేశ్‌ది అంబేడ్కర్ రాజ్యాంగం పౌరుషమన్నారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ను చూస్తే జగన్ భయపడతారని విమర్శించారు.
చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపారని, వైసీపీ ఫ్యాన్‌కు ఉక్కపోస్తోందని లోకేశ్ అన్నారు. విజనరీ అంటే చంద్రబాబు అని, ప్రిజనరీ అంటే జగన్ అని లోకేశ్ పేర్కొన్నారు. జగన్ అరెస్టయితే రోజుకో స్కాము బయటపడేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని జగన్ దెబ్బతీశారని, మూడు నెలల్లో ప్రజాస్వామ్యం పవర్ ఏంటో ప్రజలు చూపాలని పిలుపునిచ్చారు.
లక్ష కోట్ల ప్రజాధనాన్ని దోచిన వ్యక్తి పేదవాడు అవుతారా అని లోకేశ్ మండిపడ్డారు. జగన్ అహంకారం ప్రజల ఆత్మగౌరవానికి మధ్య యుద్ధం ప్రారంభమైందని లోకేశ్ అన్నారు. ఆడుదాం ఆంధ్రా అంటూ వైసీపీ ప్రభుత్వం కొత్త పథకం తీసుకు వచ్చిందని, వైసీపీ మా జీవితాలతో ఆడుకుందని ప్రజలు చెబుతున్నారని మండిపడ్డారు.
జగన్ ఐపీఎల్ టీమ్ పేరు కోడి కత్తి వారియర్స్ అని దుయ్యబట్టారు. కోడికత్తి వారియర్స్ ఆటగాడు అవినాష్ రెడ్డి అని, బెట్టింగ్ స్టార్ అనిల్ యాదవ్ అంటూ విమర్శలు గుప్పించారు. అరగంట స్టార్ అంబటి అని, గంట స్టార్ అవంతి అంటూ, ఆల్ రౌండర్ గోరంట్ల మాధవ్ అంటూ ఎద్దేవా చేశారు. రీల్స్ స్టార్ భరత్, పించ్ హిట్టర్ బియ్యపు మాధవరెడ్డి అని దుయ్యబట్టారు.
6.10 PM
విజయమా వీర స్వర్గమా తేల్చుకునే పరిస్థితి ఏర్పడింది
లోకేశ్ యువగళం ప్రజాగళంగా కదం తొక్కిందని టీడీపీ సీనియర్ నేత బాలకృష్ణ పేర్కొన్నారు. లోకేశ్ పాదయాత్రకు అనేక అడ్డంకులు సృష్టించారని మండిపడ్డారు. వైసీపీ అక్రమాలకు ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై జనసేన అధినేత పోరాడుతున్నారని స్పష్టం చేశారు.
ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా జగన్ మార్చారని బాలకృష్ణ వ్యక్తం చేశారు. పోలవరాన్ని పూర్తి చేయలేని చేతకాని ప్రభుత్వమని, డ్రగ్స్ దందాలో మాత్రం రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపారని విమర్శించారు. ల్యాండ్, శాండ్ స్కాములతో కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. అమరావతిని అభివృద్ధి చేయకుండా గాలికొదిలేశారన్నారు.
అమరావతికి భూములిచ్చిన రైతుల ఉద్యమాలను అణచివేస్తున్నారని, రాజధాని కోసం పోరాడుతున్న ప్రజలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ అరాచకాలు ఇలాగే కొనసాగితే ప్రపంచ పటంలో ఏపీ ఉండదన్నారు. రాష్ట్ర భవిష్యత్తు ప్రజల చేతుల్లోనే ఉందన్నారు.
సమయం లేదు మిత్రమా, విజయమా వీర స్వర్గమా తేల్చుకునే పరిస్థితి ఏర్పడిందని ప్రజలకు పిలుపునిచ్చారు. ఉచిత పథకాల మాయలో ప్రజలు పడవద్దని బాలకృష్ణ సూచించారు. రాష్ట్ర భవిష్యత్తును సైకో జగన్ సర్వనాశనం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం దొరకట్లేదని, ప్రజలందరూ ఆత్మపరిశీలన చేసుకోవాలని కోరారు. ఒక్క ఛాన్స్ పేరుతో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
5. 50 PM
రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీ - జనసేనను ఆదరించాలి
నేల ఈనిందా ఆకాశం చిల్లుపడిందా అన్నట్లు సభ ఉందని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హర్షం వ్యక్తం చేశారు. లోకేశ్ వారసుడు కాదని, రాజకీయ నాయకుడని గతంలోనే చెప్పినట్లు అచ్చెన్న గుర్తుచేశారు. లోకేశ్ నాయకుడు మాత్రమే కాదని, పోరాటయోధుడని కొనియాడారు.
నాడు జగన్ పాదయాత్రకు ఆటంకాలు కలగలేదని, లోకేశ్ పాదయాత్రకు ఎన్నో అడ్డంకులు సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేశ్ నిర్వహించిన పాదయాత్ర యువగళం కాదని, ప్రజాగళమని ఆయన నిరూపించారన్నారు. పాదయాత్రలో బాధితులను లోకేశ్ ఓదార్చారని, ప్రభుత్వ తప్పులు, అవినీతిని ఎండగట్టారని గుర్తు చేశారు.
టీడీపీ -జనసేన కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని అచ్చెన్న పిలుపునిచ్చారు. జగన్ కొత్త నాటకాలు ఆడుతున్నారని, టీడీపీ జనసేనను బలహీనవర్గాలకు దూరం చేయాలని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, మొత్తం దోచేశారని మండిపడ్డారు.
టీడీపీ -జనసేన కలిసి పనిచేస్తే వైసీపీకి డిపాజిట్లు కూడా రావని విమర్శించారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధికి యత్నిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రానికి పట్టిన శనిని బంగాళాఖాతంలో కలపాలలని మండిపడ్డారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీ - జనసేనను ఆదరించాలని రాష్ట్ర ప్రజలను అచ్చెన్న కోరారు. 'టీడీపీ - జనసేన'తో రాష్ట్ర భవిష్యత్తును పునర్నిర్మించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
5.40PM
వైసీపీ యువత భవిష్యత్తును అంధాకారంలోకి నెట్టింది
వైసీపీ పాలనలో అవమానాలు, వేధింపులకు గురయ్యామని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆవేదన వ్యక్తం చేశారు. మంచి ప్రభుత్వం వస్తుందని ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. రాష్ట్ర భవిష్యత్తు మారాలనే దిశగా పవన్ అడుగులు వేశారని తెలిపారు. అవినీతి ప్రభుత్వం ప్రజలకు నిరాశ మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
వైసీపీ ప్రభుత్వం యువత భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిందని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. జగన్ అరాచక పాలనలో రాష్ట్రానికి తీవ్ర నష్టాన్ని చేకూర్చిందని మండిపడ్డారు. ఒక్క ఛాన్స్ ఇస్తే ఎంత పొరపాటు జరిగిందో తెలుసుకోవాలని ప్రజలకు సూచించారు. రాష్ట్రానికి వచ్చిన ఎన్నో మంచి అవకాశాలను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
జనసేన షణ్ముఖ వ్యూహాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ - జనసేన శ్రేణులకు నాదెండ్ల పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అద్భుత ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నామని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు సాగనంపుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. టీడీపీ -జనసేన ఐక్యత వర్థిల్లాలన్నారు.
5. 30PM
అసత్యపు వాగ్దానాలతో ఓట్లు దండుకున్నారు
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అసత్యపు వాగ్దానాలతో ఓట్లు దండుకున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అరోపించారు. మన కోసం కష్టపడే చంద్రబాబుకు అన్ని వర్గాలు మద్దతివ్వాలని ఆయన పిలుపునిచ్చారు. అనేక సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల అభ్యున్నతికి చంద్రబాబు కృషి చేశారని వివరించారు. టీడీపీని గెలిపిద్దామని, చంద్రబాబు నాయకత్వాన్ని బలపరుద్దామని సందేశమిచ్చారు.
5. 15 PM
సరికొత్త చరిత్ర, నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి టీడీపీ - జనసేన
నవశకం మొదలైందని శంఖారావం పూనుకుందని ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. ఓ ఆంధ్రుడా ఊపిరి పీల్చుకో టీడీపీ -జనసేన కదిలివస్తున్నాయని పేర్కొన్నారు. సరికొత్త చరిత్ర, నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి టీడీపీ - జనసేన కదిలివస్తున్నాయని ప్రకటించారు.
5. 10 PM
దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు నివాళులు
యువగళం సభా వేదికపైకి చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్, బాలకృష్ణ చేరుకున్నారు. అయితే వీరు సభా వేదికపైకి చేరుకోగానే దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహనికి నివాళులు అర్పించారు.
5. 00 PM
చంద్రబాబు, పవన్ చేరిక
యువగళం సభా ప్రాంగణానికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ చేరుకున్నారు.
4.35 PM
లోకేశ్‌కు ఘనంగా స్వాగతం పలికిన టీడీపీ జనసేన శ్రేణులు
యువగళం సభా ప్రాంగణానికి నారా లోకేశ్ చేరుకున్న క్రమంలో, ఆయనకు టీడీపీ -జనసేన శ్రేణులు ఘనంగా పలికారు. జై లోకేశ్, జై తెలుగుదేశం - జనసేన నినాదాలతో సభా ప్రాంగణం మార్మొగింది. లోకేశ్‌తో పాటు తెలుగుదేశం తెలంగాణ ఉపాధ్యక్షురాలు నందమూరి సుహాసిని సభకు చేరుకున్నారు. సభా ప్రాంగణానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు కాసేపట్లో రానున్నారు.
4. 20PM
సభకు హాజరైన లోకేశ్, బాలకృష్ణ
యువగళం-నవశకం బహిరంగ సభకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హాజరయ్యారు. అంతేకాకుండా బహిరంగ సభకు తెలుగుదేశం సినీయర్ నేత బాలకృష్ణ కూడా హాజరయ్యారు.
3. 40 PM
వంద రోజుల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తుంది
ఉత్తరాంధ్ర ఉత్సాహంతో ఉద్యమిస్తూ ముందుకు సాగుతోందని ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. రాబోయే ఎన్నికలకు టీడీపీ -జనసేన సిద్ధమని ఈ సభ చాటుతోందని పేర్కొన్నారు. మరో వంద రోజులు ఇదే ఉత్సాహాన్ని కొనసాగించాలని టీడీపీ - జనసేన నేతలకు ఆయన పిలుపునిచ్చారు.
వంద రోజుల్లో టీడీపీ -జనసేన ప్రభుత్వం వస్తోందని రామ్మోహన్ నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. వంద రోజుల్లో రాష్ట్రానికి పట్టిన శనిని వదిలించుకోబోతున్నామని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. వంద రోజుల్లో రైతులను రారాజులను చేయబోతున్నామని హామీ ఇచ్చారు. యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నామని, లక్ష్యాలను దాటుకుని ముందుకు నడవాలని ఆయన యువతకు సూచనలిచ్చారు.
3. 39 PM
టీడీపీ - జనసేన విజయ సాధించబోతుంది అనడానికి ప్రజలే నిదర్శనం
నవగళం బహిరంగ సభలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య పాల్గొన్నారు. ఆయన ప్రసంగిస్తూ రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు కనీవిని ఎరుగని రీతిలో సభ జరుగుతోందని సంతోషం వ్యక్తం చేశారు. టీడీపీ -జనసేన సాధించబోతుందనడానికి ఈ సభకు హాజరైన ప్రజలే నిదర్శనమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
3. 35 PM
జగన్ సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో ఫాక్షనిస్టు, రాక్షస పాలన
నవగళం బహిరంగసభకు టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి సీఎం అయినతర్వాత రాక్షస పాలన, ఫ్యాక్షనిస్టు సాగుతోందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో హక్కుల కోసం పోరాడుతున్న వారిపైనే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. అరాచకపాలనపై విసిగిపోయిన రాష్ట్ర ప్రజలు యువగళానికి బ్రహ్మరథం పట్టారన్నారు.
3.30 PM
ప్రారంభమైన యువగళం - నవశకం బహిరంగ సభ
తెలుగుదేశం నిర్వహిస్తున్న యువగళం - నవశకం బహిరంగ సభ ప్రారంభమైంది. విజయనగరం జిల్లా పోలిపల్లి వేదికగా ఈ సభను నిర్వహిస్తున్నారు. లోకేశ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయోత్సవ సభను నిర్వహిస్తున్నారు. 226 రోజులు, 97 నియోజకవర్గాల మీదుగా లోకేశ్ యాత్ర కొనసాగింది. పాదయాత్రలో మొత్తం 3,132 కి.మీ. నారా లోకేశ్ నడిచారు. సార్వత్రిక ఎన్నికలకు టీడీపీ - జనసేన ఈ సభ ద్వారా సమర శంఖం పూరించనుంది.
3.13 PM
విశాఖకు చేరుకున్న జనసేనాని
'యువగళం-నవశకం' బహిరంగ సభకు హాజరయ్యేందుకు విజయనగరం నుంచి బయల్దేరిన జనసేన అధినేత పవన్ విశాఖకు చేరుకున్నారు. ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి విశాఖకు బయల్దేరిన విషయం తెలిసిందే.
3.05 PM
సభ ప్రాంగణంలో పండగ వాతావరణం
యువగళం విజయోత్సవ సభ ప్రాంగణంలో పండగ వాతావరణం నెలకొంది. బెలూన్లు, డీజే చప్పుళ్లు, నినాదాలతో నవశకం ప్రాంగణం హోరెత్తుతోంది. నవశకం వేదికపై ఉత్తరాంధ్ర సాంప్రదాయ కళా నృత్యాలు అలరిస్తున్నాయి. సభా ప్రాంగణంలో ఆకర్షణీయంగా నేతల భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. అందులో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్, బాలయ్య కటౌట్లు ఉన్నాయి.
టీడీపీ - జనసేన కార్యకర్తల కేరింతలతో సభా ప్రాంగణంలో సందడి నెలకొంది. ఇప్పటికే రాష్ట్ర నలుమూలల నుంచి ఇరుపార్టీల నేతలు తరలివచ్చారు. విశాఖ నుంచి సభా ప్రాంగణం వరకు బ్యానర్లు, జెండాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా, టీడీపీ -జనసేన నేతలు ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ కార్యకర్తలకు పలు సూచనలు అందిస్తున్నారు.
3.00 PM
సభా ప్రాంగణానికి తండోప తండాలుగా ప్రజలు
యువగళం-నవశకం బహిరంగ సభా ప్రాంగణానికి జనం తండోప తండాలుగా తరలివస్తున్నారు. టీడీపీ - జనసేన పార్టీ జండాలు, పార్టీ పతకాలు చేత పట్టుకుని జై టీడీపీ, జైజై లోకేశ్, జై చంద్రబాబు, జైజై పవన్ అంటూ నినాదాలతో సభా వేదిక వద్దకు చేరుకుంటున్నారు.
2: 39 PM
కాసేపట్లో సభ ప్రారంభం
కాసేపట్లో విజయనగరం జిల్లా పోలిపల్లి వేదికగా యువగళం - నవశకం సభ ప్రారంభం కానుంది. లోకేశ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయోత్సవ సభ నిర్వహిస్తున్నారు. 226 రోజులు, 97 నియోజకవర్గాల మీదుగా లోకేశ్ యాత్ర సాగింది. పాదయాత్రలో మొత్తం 3,132 కి.మీ. నడవగా, సార్వత్రిక ఎన్నికలకు టీడీపీ - జనసేన సమర శంఖం పూరించనుంది.
2: 30 PM
ప్రముఖ నేతల రాక
నెల్లిమర్ల నియోజకవర్గం పోలిపల్లి వద్ద నిర్వహిస్తున్న సభకు టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలుగుదేశం సినీయర్ నాయకులు బాలకృష్ణ హాజరుకానున్నారు. ఇప్పటికే పోలిపల్లి వద్దనున్న రిసార్ట్స్‌కు చంద్రబాబు, బాలకృష్ణ చేరుకున్నారు.
2: 28 PM
సభకు బయల్దేరిన పవన్ కల్యాణ్
'యువగళం-నవశకం' బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. ఆయన విజయవాడ నుంచి విశాఖకు బయల్దేరారు. ఈ క్రమంలో గన్నవరం విమానాశ్రయం నుంచి పవన్ బయల్దేరారు.
2: 26 PM
పదేళ్ల తర్వాత ఒకే వేదికపై చంద్రబాబు - పవన్, సభకు తరలివస్తున్న టీడీపీ శ్రేణులు
యువగళం - నవశకం పేరుతో టీడీపీ భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సభలో పాల్గొనడానికి రాష్ట్రం నలుమూలల నుంచి టీడీపీ శ్రేణులు భారీగా సభ ప్రాంగాణానికి చేరుకుంటున్నారు. దాదాపు పది సంవత్సరాల తర్వాత ఒకే బహిరంగ వేదికపైన చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లు హాజరుకానున్నారు. ఈ సభలో ఇరు పార్టీల నేతలు ఉమ్మడిగా పలు కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది.
2: 20 PM
ఏర్పాట్లు, వేదికలో స్థానాలు
తెలుగుదేశం నిర్వహిస్తున్న యువగళం - నవశకం బహిరంగ సభకు సుమారు 6 లక్షల మందికి పైగా జనాలు వస్తారని అంచనా ఉంది. అయితే సభకు వచ్చేవారికి క్యూఆర్ కోడ్‌తో కూడిన పాసులను తెలుగుదేశం అందించింది. 600 మందికిపైగా ముఖ్య నాయకులు ఆసీనులయ్యేలా విధంగా వేదికను ఏర్పాటు చేశారు.
వేదికపై అత్యంత ముఖ్య నాయకులకు ప్రోటోకాల్ ప్రకారం స్థానాలు కల్పించారు. సభ వేదికకు దూరంగా ఉన్న పార్టీ శ్రేణులకు కనిపించేలా అతి పెద్ద ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు చేశారు. సభ నిర్వహణకు ముఖ్య నాయకులు, కార్యకర్తలతో 16 కమిటీల ఏర్పాటు చేసినట్లు టీడీపీ వివరించింది.
2: 15 PM
భారీ కటౌట్లు, హోర్డింగ్‌లు - పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు
ఉత్తరాంధ్రలోని ప్రతి నియోజకవర్గంలోనూ టీడీపీ - జనసేన నేతలు భారీ స్థాయిలో కటౌట్లు, స్వాగతద్వారాలను ఏర్పాటు చేశారు. భోగాపురం నుంచి విశాఖ వరకు భారీ స్థాయిలో హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలను కట్టారు. ఎదుటివారికి ఇబ్బందులు తలెత్తకుండా యువగళం వాలంటీర్లు సమన్వయం చేసుకుంటున్నారు. సభకు వచ్చే వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లను టీడీపీ పూర్తి చేసింది.
యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయోత్సవ సభ:
టీడీపీ నేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయోత్సవ సభ విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం పోలిపల్లి వేదికగా ధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 వరకు జరుగుతోంది. యువగళం-నవశకం పేరిట నేడు తెదేపా భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది.ఈ సభకు చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ హాజరుకానున్నారు. ఇరు పార్టీల నేతలు ఉమ్మడిగా పలు కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది.