ఉత్తర్ప్రదేశ్లో ఓ మహిళా బస్ కండక్టర్ పాట్లు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. తను పనిచేసే రవాణా శాఖలో పిల్లల సంరక్షణ సెలవులు లేని కారణంగా ఐదు నెలల చిన్నారితో విధులకు హాజరవుతోంది. గోరఖ్పుర్ నుంచి పద్రౌనా మధ్యలో నడిచే బస్సులో పసికందును చంకనెత్తుకుని టికెట్లు ఇస్తోంది. మిషన్ శక్తి వంటి పథకాలతో మహిళా సాధికారతకు పాల్పడుతున్నామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా.. ఆ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖలో ఇప్పటికీ పిల్లల సంరక్షణ సెలవులు లేకపోవడం గమనార్హం.
ఉన్నతాధికారుల తిరస్కరణతో..
శిప్రా దీక్షిత్ అనే మహిళా డిసీస్డ్ డిపెండెంట్ కోటాలో ఉద్యోగం పొంది 2016 నుంచి టికెట్ కండక్టర్గా పనిచేస్తోంది. 2020 జులై 25 నుంచి ఆరు నెలలపాటు ప్రసూతి సెలవుల్లో ఉన్నారు. 2020, ఆగస్టు 21న ఓ పాపకు జన్మనిచ్చింది. తిరిగి 2021, జనవరి 19న విధుల్లో చేరింది. పసిపాప ఆలనా పాలనా చూసుకోనే వీలు ఉండేందుకు కండక్టర్గా కాకుండా కార్యాలయానికి బదిలీ చేయాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేసినా.. అధికారులు తిరస్కరించారు. ఏదేమైనా విధులకు హాజరు కావాలని ఆదేశించారు. ఉద్యోగం పోతుందనే భయంతో ఐదు నెలల పసికందుతోనే శిప్రా విధులు నిర్వర్తిస్తోంది.
వివక్షను చూపిస్తున్నారు..
ఎమ్మెస్సీ కెమిస్ట్రీ టాపర్గా నిలిచిన తనపట్ల అధికారులు వివక్షను చూపిస్తున్నారని శిప్రా అంటోంది. హాజరుకాలేదని తదితర కారణాలతో తన జీతంలో కోత విధిస్తున్నారని ఆరోపిస్తోంది. అన్ని అర్హతలున్నా పదోన్నతి రాలేదని వాపోతుంది. తనకన్నా తక్కువ అనుభవం ఉన్నవారికి కార్యాలయ పనులు అప్పగించారని శిప్రా ఆరోపిస్తున్నారు.
ఉద్యోగ స్వభావమే అలాంటిది..
ఐదు నెలల పసికందును చంకనేసుకుని శిప్రా విధులు నిర్వర్తించడంపై అసిస్టెంట్ రీజనల్ మేనేజర్ కేకే తివారీని అడగగా.. కండక్టర్ ఉద్యోగ స్వభావమే అలాంటిదని అంటున్నారు. శిప్రాకు ప్రసూతి సెలవులు ఇచ్చామని, పిల్లల సంరక్షణ సెలవులు రవాణా శాఖలో లేనందున ఎలాంటి సహాయం చేయలేమని చెబుతున్నారు. ఆమెకు కార్యాలయ పనులు అప్పగించాలంటే ఉన్నతాధికారుల అనుమతి అవసరమని చెప్పారు.
ఇదీ చదవండి:ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణే ఔషధమా?