కర్ణాటక బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో సెక్కూరిటీ అధికారులు వేధింపులకు గురిచేశారని ఓ మహిళ ఆరోపించారు. చెకింగ్ సమయంలో సీఐఎస్ఎఫ్ అధికారులు తన చొక్కా తొలగించాలని వేధించినట్లు ఆమె ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆ తర్వాత ఆ ట్వీట్‌ను తొలగించి.. అకౌంట్‌ను డీయాక్టివేట్ చేశారు.
ఓ మహిళా సంగీత విద్వాంసురాలు మంగళవారం.. బెంగళూరు నుంచి అహ్మదాబాద్‌కు వెళ్లడానికి కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లారు. అయితే అక్కడ చెకింగ్ సమయంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారులు.. తనను చొక్కా తీసేయమని అడిగినట్లు ఓ ట్వీట్లో పేర్కొన్నారు. 'ఇది చాలా అవమానకరమైన అనుభవం' అని ఆమె తన ట్వీట్లో వెల్లడించారు.
"బెంగళూరు విమానాశ్రయంలో భద్రతా తనిఖీల సమయంలో నా షర్ట్ తీసివేయమని అడిగారు. సెక్యూరిటీ చెక్‌పాయింట్‌లో నేను లోదుస్తులు మాత్రమే ధరించి ఉన్నాను. ఓ మహిళగా దీన్ని ఎప్పటికీ మరచిపోలేను.. నిజంగా చాలా అవమానకరంగా ఉంది. @BLRAirport ఓ మహిళ బట్టలు తీయవలసిన అవసరం మీకు ఏం వచ్చింది?"
-- ఆ మహిళ చేసిన ట్వీట్
బుధవారం ఉదయం ఆమె ఆ ట్వీట్‌ను తొలగించారు. ఆ తర్వాత తన ట్విట్టర్ అకౌంట్‌ను డీయాక్టివేట్ చేశారు. ఈ ట్వీట్‌కు సంబంధిత అధికారులు విమానాశ్రయ అధికారిక ట్విట్టర్ హ్యాండల్ నుంచి స్పందించారు. "తీవ్రంగా చింతిస్తున్నాము.. ఇలా జరగకూడదు. మేము దీనిని మా ఉన్నత అధికారులకు తెలియజేశాము. సీఐఎస్ఎఫ్ భద్రతా బృందానికి కూడా నివేదించాము" అని బెంగళూరు విమానాశ్రయ అధికారులు రిప్లై ఇచ్చారు. దీనిపై ఉన్నత అధికారుల నుంచి ఎటువంటి స్పందన రాలేదు.