Worlds largest temple: ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం భారత్‌లో రూపుదిద్దుకోనుంది. బంగాల్లోని మాయాపుర్ వాసుల దశాబ్దాల కల నెరవేరనుంది. మాయాపుర్లో ఇస్కాన్ సంస్థ నిర్మిస్తున్న వేదిక్ ప్లానెటేరియం 2024 నాటికి పూర్తికానుంది. ఈ మేరకు సంస్థ ప్రతినిధి ఈటీవీ భారత్‌కు వెల్లడించారు. ఇది పూర్తయితే వైశాల్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన కట్టడంగా నిలవనుంది.
Largest Hindu temple in the World: ఈ వేదిక్ ప్లానెటేరియం నిర్మాణానికి 1976లోనే అడుగులు పడ్డాయి. ఇస్కాన్ సంస్థ వ్యవస్థాపకులు ప్రభుపాద ఈ మేరకు ప్రయత్నాలు చేశారు. మాయాపుర్లో ఉన్న ఇస్కాన్ మందిరానికి అనుబంధంగా వైదిక జ్ఞాన, విజ్ఞాన కేంద్రం ఉండాలని ఆయన భావించారు. వేదాల జ్ఞానాన్ని ప్రజలకు పంచడం సహా ప్రపంచం ఎలా ఏర్పడిందనే విషయాలను ఈ ప్లానెటేరియం ద్వారా తెలియజేయాలని అనుకున్నారు. అయితే, దశాబ్దాలు గడిచిన తర్వాతే ఈ నిర్మాణ పనులకు మోక్షం లభించింది.
Vedic planetarium temple: అమెరికా క్యాపిటల్ భవనాన్ని తలపించే ఈ నిర్మాణం 2010 ఫిబ్రవరి 14న ప్రారంభమైంది. ప్రతిష్టాత్మకంగా సాగుతున్న నిర్మాణ పనులు పలు కారణాల వల్ల 2016లో నిలిచిపోయాయి. అనంతరం, కొవిడ్ వ్యాప్తి ప్రారంభమైంది. ఫలితంగా మందిర నిర్మాణం మరింత ఆలస్యమైంది. కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో మందిర నిర్మాణాన్ని పూర్తి చేయడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. 2024 నాటికి నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
"మాయాపుర్లో ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం నిర్మించాలన్నది శ్రీ ప్రభుపాద కల. ఆయన కల నెరవేరబోతోంది. భక్తుల సాయంతో మందిర నిర్మాణం 2024 నాటికి పూర్తి కానుంది. శాంతిని అన్వేషించే ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులంతా ఇక్కడికి వస్తారు."
-రసిక్ గౌరంగ్ దాస్, మాయాపుర్ ఇస్కాన్ మందిరం ప్రతినిధి
అల్ఫ్రెడ్ ఫోర్డ్.. అంబరీశ్ దాస్‌గా మారి...
Ford owner Hindu : ఫోర్డ్ కంపెనీ వ్యవస్థాపకుడైన హెన్రీ ఫోర్డ్ ముని మనవడు అల్ఫ్రెడ్ ఫోర్డ్.. ఈ మందిర నిర్మాణం వెనక కీలకంగా వ్యవహరించారు. 1975లో ఇస్కాన్‌లో చేరిన అల్ఫ్రెడ్ ఫోర్డ్.. తన పేరును అంబరీశ్ దాస్‌గా మార్చుకున్నారు. ఈ మందిర నిర్మాణం కోసం ఆయన 30 మిలియన్ డాలర్లు (సుమారు రూ.240 కోట్లు) విరాళంగా ఇచ్చారు.
తాజ్‌మహల్, వాటికన్ చర్చి కన్నా పెద్దది
ఈ మందిరం అనేక ప్రత్యేకతలకు నెలవు కానుంది. ప్రపంచంలోనే అతిపెద్ద డోమ్ కలిగి ఉన్న మతపరమైన కట్టడంగా ఇది రికార్డుకెక్కనుంది. ఈ కట్టడం తాజ్‌మహల్, వాటికన్ సిటీలోని సెయింట్ పాల్ కేథడ్రల్ చర్చి కన్నా భారీగా ఉండనుంది. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన హిందూ మందిరంగా రికార్డు సృష్టించనుంది.