ఉత్తర్‌ప్రదేశ్‌లోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ట్రక్‌ను కారు ఢీకొట్టడం వల్ల ఐదుగురు మరణించారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందినవారు నలుగురు ఉన్నారు. మృతులను సైనా ఖటూన్(37), జమీలా(33), రుస్కార్(31), సాహిల్ ఖాన్(19) కారు డ్రైవర్ షారుక్(25)గా పోలీసులు గుర్తించారు. సుల్తాన్‌పుర్‌లో ఆదివారం జరిగిందీ ప్రమాదం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రుక్సర్ కుమారుడు(3 ఏళ్లు) దిల్లీ ఎయిమ్స్‌లో చనిపోయాడు. అనంతరం కుమారుడి మృతదేహంతో దిల్లీ నుంచి బిహార్‌లోని ససరాంకు కారులో బయలుదేరారు. ఉదయం 11.45 నిమిషాల సమయంలో కారు పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వే 183 మైలురాయి వద్ద ఆగి ఉన్న ట్రక్‌ను ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాలను పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం అస్పత్రికి తరలించారు పోలీసులు.
కారు బోల్తా.. ముగ్గురు మృతి..
రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బోల్తా పడిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. ఆదివారం సాయంత్రం సిరోహ్ జిల్లాలోని బీవార్-పింద్వారా హైవేపై జరిగిందీ ఘటన.
ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న పొలంలో పడిపోయిందని వెల్లడించారు. మృతులు చురు జిల్లాకు చెందిన ప్రతాప్ సింగ్, కర్ణి సింగ్, శివశంకర్ అని పోలీసులు పేర్కొన్నారు. మృతదేహాలను పింద్వారాలోని మార్చురీలో భద్రపరిచామని.. పోస్టుమార్టం పరీక్షల అనంతరం వారి కుటుంబాలకు అప్పగిస్తామని తెలిపారు.
పల్లకిపైకి దూసుకెళ్లిన వ్యాన్..
ఒడిశాలో విషాదం నెలకొంది. మతపరమైన పండుగలో భాగంగా పల్లకిని మోస్తున్న వ్యక్తులను పికప్ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటన ఇద్దరు మరణించగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. కేంద్రపార జిల్లాలో శనివారం రాత్రి జరిగిందీ ఘటన.
కటక్-చంద్‌బాలి రాష్ట్ర రహదారిపై వేగంగా వచ్చిన పికప్ వ్యాన్ ఐదుగురిని ఢీకొట్టింది. అందులో ఒకరు అక్కడికక్కడే మరణించారు. మిగతావారిని ఆస్పత్రికి తరలించారు స్థానికులు. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మరణించాడు. క్షతగాత్రులు కటక్‌లోని ఎస్‌సీబీ మెడికల్ కాలేజీ అండ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. పికప్ వ్యాన్‌ను సీజ్ చేసి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. అధిక వేగమే ఈ ప్రమాదానికి కారణమని పేర్కొన్నారు.