UP Elections 2022: ఎన్నికలు వచ్చాయంటే చాలు నాయకులు, కార్యకర్తలతో వీధులన్నీ సందడిగా మారతాయి. ర్యాలీలు, పాదయాత్రలు, రోడ్ షోలు, ఇంటింటా ప్రచారాలతో పోటీచేసే అభ్యర్థులు తీరిక లేకుండా గడుపుతారు. అయినా సరే, నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించడం సాధ్యం కాదు.
అలాంటి సందర్భాల్లో అభ్యర్థి తరఫున అతడి కుటుంబసభ్యులు, బంధువులు ప్రచారంలో పాల్గొనడం మనం చూసే ఉంటాం. అయితే, తండ్రి విజయం కోసం అయోధ్యలో ఓ ఏడేళ్ల చిన్నారి ఎన్నికల ప్రచారం చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యకు చెందిన పవన్‌పాండే సమాజ్‌వాదీ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ఆయన కుమార్తె గాయత్రి పాండే. హాయిగా ఆడుతూ, పాడుతూ ఎంజాయ్ చేయాల్సిన ఆ చిన్నారి.. తండ్రి విజయం కోసం ఇంటింటా ప్రచారంలో పాల్గొంటోంది.
'దయచేసి మా నాన్నకు ఓటేయండి. అఖిలేశ్ యాదవ్ జీ ముఖ్యమంత్రి అయితే మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి' అంటూ ప్రచారం చేస్తోంది. గాయత్రి పాండే చేస్తున్న ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది.
పవన్ పాండే 2012 శాసనసభ ఎన్నికల్లో భాజపా అభ్యర్థిని ఓడించి అఖిలేశ్ యాదవ్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. 2017లో భాజపా అభ్యర్థి వేద్ ప్రకాశ్ గుప్తా చేతిలో ఓడిపోయారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఫిబ్రవరి 10 నుంచి ఏడు దశల్లో ఎన్నికలు జరగనుండగా.. అయోధ్య నియోజకవర్గంలో ఫిబ్రవరి 27న (ఐదో దశలో) ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: రైల్వే పరీక్షల్లో అవకతవకలు- నేడు ఆ రాష్ట్ర బంద్!