కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన జ్యోతికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారు, లగేజీ వ్యాన్ ఢీకొన్నాయి. కర్ణాటకలోని విజయపుర జిల్లాలో జరిగిన ఘటనలో కేంద్ర మంత్రితో ఆమె కారు డ్రైవర్‌కు స్పల్ప గాయాలయ్యాయి. వెంటనే స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందారు.
ఇదీ జరిగింది..
విజయపుర నగరంలో జరిగిన బీజేపీ మహిళా సమ్మేళనంతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన జ్యోతి వచ్చారు. షెడ్యూల్ ప్రకారం ఆమె వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గురువారం సాయంత్రం ఏపీఎంసీలో మత్స్యకారులతో సమావేశం జరగాల్సి ఉంది. కానీ పలు కారణాల రీత్యా రద్దు చేసుకున్నారు. అనంతరం బాగల్కోట్కు బయలుదేరారు.
ఆ సమయంలో విజయపుర- హుబ్లీ జాతీయ రహదారి 50పై జుమనాల గ్రామ సమీపంలో ఆమె కారు, లగేజీ వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మంత్రి కారు ముందు భాగం ధ్వంసమైంది. లగేజీ వ్యాన్ పల్టీ కొట్టింది. దీంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకున్నారు. అప్పటికే మంత్రి.. స్థానిక ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స పొంది వెనుదిరిగారు.
కొద్దిరోజుల క్రితం.. కేంద్ర మంత్రి అశ్వినీ చౌబే కాన్వాయ్‌లోని ఓ వాహనం ప్రమాదానికి గురైంది. ఎస్కార్ట్ వాహనాల్లోని కొరన్సరాయ్ పోలీసు స్టేషన్‌కు చెందిన ఓ కారు బోల్తా కొట్టింది. బిహార్‌లో జరిగిన ఈ ఘటనలో పలువురు పోలీసులు గాయపడ్డారు. కేంద్ర మంత్రి బక్సర్ నుంచి పట్నాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. భగవంతుడి దయ వల్ల ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదని కేంద్ర మంత్రి అశ్వినీ చౌబే ట్విట్టర్లో తెలిపారు. ఈ మేరకు ఓ వీడియో పోస్ట్ చేశారు.
మాథిలా- నారాయణ్‌పుర్ రహదారిపై ఉన్న దుమ్రావ్ వంతెనపై ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను కేంద్ర మంత్రే స్వయంగా ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఘటనలో పోలీసుల బొలేరో వాహనం క్రాష్ అయిపోయింది. వెనక ఉన్న కారు డ్రైవర్లు అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. ఘటనలో గాయపడ్డ పోలీసులను దుమ్రావ్ సదర్ ఆస్పత్రికి తరలించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. వాహన డ్రైవర్‌కు సైతం గాయాలయ్యాయని చెప్పారు. ఇద్దరు పోలీసులను మెరుగైన చికిత్స నిమిత్తం పట్నా ఎయిమ్స్‌కు తరలించారు