కరోనా చికిత్సలో భాగంగా వినియోగిస్తున్న ఐవర్‌మెక్టిన్, హైడ్రాక్సీక్లోరోక్విన్, ఫావిపిరవిర్ వంటి ఔషధాలు వయోజనుల కోసమేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనా సోకిన చిన్నారులకు వీటిని ఉపయోగించేందుకు సిఫార్సు చేయలేదని తెలిపింది. డాక్సిసైక్లైన్, అజిథ్రోమిసిన్ వంటి యాంటీ బయాటిక్స్‌కు కూడా ఇదే వర్తిస్తుందని తాజా మార్గదర్శకాల్లో వివరించింది. ఈ ఔషధాలు, యాంటీ బయాటిక్స్‌ను చిన్నారులపై ఇప్పటివరకు ప్రయోగించలేదని తెలిపింది.
కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉన్న చిన్నారులకు చికిత్స అందించే విధంగా కొవిడ్ కేర్ సెంటర్లలో సదుపాయాలను మెరుగుపర్చాలని మార్గదర్శకాల్లో సూచించింది కేంద్ర ఆరోగ్య శాఖ. చిన్నారులకు కరోనా టీకా అందుబాటులోకి వస్తే.. అనారోగ్య సమస్యలు ఉన్న వారికి ప్రాధాన్య క్రమంలో వ్యాక్సిన్ అందించనున్నట్లు తెలిపింది.
ఇదీ చదవండి: పిల్లలకు కరోనా సోకితే లక్షణాలు ఎలా ఉంటాయి?
కరోనా వైరస్ కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని కేంద్రం అంచనా వేసింది. లాక్డౌన్ తొలగించడం, పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తి పెరగొచ్చని అభిప్రాయపడింది. దీన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల భాగస్వామ్యం అవసరమని పేర్కొంది.
మార్గదర్శకాలు ఇవే
- రెండో దశలో గరిష్ఠంగా నమోదైన కేసుల ఆధారంగా ప్రతి జిల్లాలో చిన్నారుల కోసం అదనపు పడకల ఏర్పాటుకు అంచనాకు రావాలి. తద్వారా పిల్లల్లో కరోనా కేసులు, ఆస్పత్రిలో చేరుతున్న కేసుల వివరాలు తెలుసుకోవచ్చు.
- తీవ్రమైన కొవిడ్‌తో బాధపడే చిన్నారులకు చికిత్స అందించేలా ప్రస్తుతమున్న కొవిడ్ సంరక్షణ కేంద్రాలు సదుపాయాలను మెరుగుపర్చుకోవాలి. చిన్నారులకు ప్రత్యేకంగా అవసరమయ్యే పరికరాలు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలి.
- సుశిక్షితులైన మానవ వనరుల(డాక్టర్లు, నర్సులు)ను సిద్ధం చేసుకోవాలి. చిన్నారుల సంరక్షణ కోసం వైద్య అధికారులు సామర్థ్యం పెంపు కార్యక్రమాలు చేపట్టాలి.
- పిల్లల ఆస్పత్రుల్లో.. కొవిడ్ సోకిన చిన్నారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి.
- జిల్లా ఆస్పత్రులకు, కొవిడ్ కేర్ సెంటర్లకు వైద్య కళాశాలలు సహకారం అందించాలి.
- ఉత్తమ కొవిడ్ సంరక్షణ కేంద్రాలను గుర్తించి.. కింది స్థాయిలోని కేంద్రాలకు వీటి ద్వారా సహకారం అందేలా చేయాలి.
- అన్ని స్థాయులలో సమాచార సేకరణ సరిగ్గా జరగాలి. చిన్నారుల్లో కొవిడ్‌కు సంబంధించి త్వరలోనే జాతీయ రిజిస్ట్రీ ప్రారంభమవుతుంది.
ఇంట్లో చికిత్స చాలు..
ఎక్కువ మంది చిన్నారులకు కరోనా లక్షణాలు ఉండటం లేదని కేంద్రం తెలిపింది. స్వల్ప లక్షణాలు ఉన్నవారు ఇంట్లోనే చికిత్స తీసుకుంటే సరిపోతుందని స్పష్టం చేసింది. వీరికి పారాసిటమాల్ ట్యాబ్లెట్లను సిఫార్సు చేసింది. ఈ రోగులపై పర్యవేక్షణ ఉంచాలని ఆశా, ఎంపీడబ్ల్యూ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసింది. తల్లితండ్రులు.. కొవిడ్ సోకిన పిల్లల శ్వాసక్రియ రేటును, ఆక్సిజన్ స్థాయులను గమనిస్తూ ఉండాలని సూచించింది.
ఇదీ చదవండి: పిల్లల్లో కరోనా ముప్పు.. అశ్రద్ద వద్దంటున్న నిపుణులు
సీరో సర్వే నివేదిక ప్రకారం పదేళ్లు పైబడిన పిల్లల్లో కరోనా వ్యాప్తి వయోజనుల స్థాయిలోనే ఉంటుందని మార్గదర్శకాల్లో కేంద్రం పేర్కొంది. ఆరోగ్యంగా ఉన్న చిన్నారుల్లో తీవ్రస్థాయిలో కరోనా ప్రబలే అవకాశం చాలా అరుదు అని వివరించింది.
ఇవీ చదవండి: