Newsclick Delhi High Court : కఠినమైన ఉగ్ర వ్యతిరేక చట్టం-ఉపా చట్టం కింద తమపై కేసు నమోదు చేయడంపై దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు న్యూస్‌క్లిక్ ఫౌండర్ ప్రబీర్ పుర్కాయస్థ, ఆ సంస్థ హెచ్ఆర్ అమిత్ చక్రవర్తి. ఈ కేసులో తమకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. రిమాండ్ విధిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను, తమపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ ఓ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. ఈ దశలో మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దాంతోపాటు నిందితుల పిటిషన్‌పై పోలీసుల స్పందన కోరింది.
సోమవారం కల్లా ఈ కేసు డైరీని కోర్టు ముందు ఉంచాలని దర్యాప్తు అధికారులను ఆదేశించింది దిల్లీ హైకోర్టు. అదేవిధంగా దివ్యాంగుడైన చక్రవర్తి ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని సూచించింది. దిల్లీ పోలీసుల తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు హాజరయ్యారు. ఈ పిటిషన్‌పై వాదనలు వినిపించేందుకు సోమవారం వరకు గడువు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. న్యాయమూర్తి జస్టిస్ తుషార్ రావు గేదెల ఈ పిటిషన్‌పై వాదనలు ఆలకించారు. ప్రబీర్ పుర్కాయస్థ, అమిత్ చక్రవర్తి తరుపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కోర్టు ముందు వాదనలు వినిపించారు.
UAPA case against NewsClick : కాగా, న్యూస్‌క్లిక్‌పై దిల్లీ పోలీసులు కఠినమైన ఉపా కింద కేసు నమోదు చేశారు పోలీసులు. భారత సార్వభౌమత్వాన్ని విచ్ఛిన్నం చేసేందుకు చైనా నుంచి న్యూస్‌క్లిక్‌కు భారీగా నిధులు అందాయని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. దేశంపై అసంతృప్తిని ప్రేరేపించేలా వ్యవహరించారని పోలీసులు తెలిపారు. 2019 లోక్‌సభ ఎన్నికల వేళ ఎలక్షన్ ప్రక్రియను దెబ్బతీసేందుకు న్యూస్‌క్లిక్ ఎడిటర్-ఇన్-చీఫ్ ప్రబీర్ పుర్కాయస్థ P.A.D.S అనే సంస్థతో పాటు పలువురు జర్నలిస్టులతో కలిసి కుట్రలు చేశారని పోలీసులు ఆరోపించారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రచార విభాగంలోని ఓ వ్యక్తి ఈ విదేశీ నిధులను పంపుతున్నట్లు పేర్కొన్నారు.
షావోమీ, వివో వంటి సంస్థలు భారత్‌లో వేలాది షెల్‌కంపెనీలను PMLA, ఫెమా చట్టాలకు విరుద్ధంగా ఏర్పాటు చేసి ఈ నిధుల్ని తరలిస్తున్నట్లు ఎఫ్ఐఆర్లో నమోదైంది. ప్రభుత్వ యంత్రాంగ విధానాలు, అభివృద్ధి ప్రాజెక్టులను విమర్శించడం, చైనా ప్రభుత్వ విధానాలు సమర్థించే కుట్రలు జరిగినట్లు పేర్కొన్నారు. నిధులను సామాజిక కార్యకర్త అయిన గౌతమ్ నవలఖా, తీస్తా సేతల్వాద్, జావేద్ ఆనంద్‌లతో పాటు ఉర్మిలేశ్, పరన్జాయ్ గుహ వంటి జర్నలిస్టులకు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. చాలామందికి ఈ న్యూస్‌క్లిక్‌తో సంబంధాలున్నట్లు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.