TS HC Questions to APCID in Margadarsi Case: మార్గదర్శిపై నమోదైన కేసులకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ప్రధానంగా ఏపీ సీఐడీ అధికారులు కేసుకు సంబంధించిన వివరాలను మీడియా సమావేశం పెట్టి వెల్లడించడాన్ని మార్గదర్శి తరపు సీనియర్ న్యాయవాది నాగముత్తు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేసు వివరాలను మీడియాకు వివరించే అవసరం ఏమొచ్చిందని.. ఎవరైనా చందాదారులు ఫిర్యాదు చేశారా అని తెలంగాణ హైకోర్టు ఆరా తీసింది.
దర్యాప్తు గురించి మార్గదర్శి ప్రశ్నించడం లేదని.. దాని గురించి మీడియాకు వెల్లడించడంపైనే అభ్యంతరం వ్యక్తం చేస్తోందని పేర్కొంది. మీడియాకు వెల్లడించడం వల్ల ఏం సాధించాలని అనుకున్నారని.. సీఐడీని ప్రశ్నించింది. మీడియా సమావేశాలపై నియంత్రణ ఉండాలని గత విచారణలోనే చెప్పినా పాటించరా అని నిలదీసింది. ప్రభుత్వ న్యాయవాదికి చెబితే అమలవుతుందని భావిస్తామని వ్యాఖ్యానించింది. దీనికి సంబంధించిన వివాదం కోర్టులో పెండింగ్ ఉన్నపుడు నియంత్రణ అవసరమని, పిటిషన్లపై తేలేదాకా మీ అధికారులను నియంత్రించాలని.. ఏపీ ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది.
మార్గదర్శి కేసులకు సంబంధించి దాఖలైన అన్ని పిటిషన్లలోనూ కౌంటర్లు దాఖలు చేయడానికి చివరి అవకాశం ఇస్తున్నామని తేల్చిచెప్పింది. కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణను సెప్టెంబరు 12కి వాయిదా వేసింది. అప్పటి వరకు గతంలో తాము జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది.
TS High Court Last Chance to AP Govt to File Counter in Margadarsi Case: మార్గదర్శిపై నమోదు చేసిన కేసులకు సంబంధించి ఆ సంస్థ, ఛైర్మన్, ఎండీ, సిబ్బంది దాఖలు చేసిన పలు పిటిషన్లపై.. జస్టిస్ సి.వి.భాస్కర్‌రెడ్డి బుధవారం విచారణ చేపట్టారు. ఏపీ ప్రభుత్వ తరఫు న్యాయవాది పి.గోవిందరెడ్డి వాదనలు వినిపిస్తూ అన్ని పిటిషన్లలోనూ కౌంటర్లు దాఖలు చేయడానికి కొంత గడువు కావాలని కోరారు. ఈ దశలో మార్గదర్శి తరఫు సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ జోక్యం చేసుకొని.. ఏపీ ప్రభుత్వం కావాలనే జాప్యం చేస్తోందని, విచారణను మరికొంత ముందు చేపట్టాలని అభ్యర్థించారు.
సుప్రీంకోర్టులో పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నప్పటికీ జులై 20లోగా కౌంటర్లు దాఖలు చేయాలని.. ఈ కోర్టు ఆదేశించిందని చెప్పారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి ..
చివరి అవకాశంగా గడువిస్తున్నామని, సెప్టెంబరు 12లోగా కౌంటర్లు దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించారు. పిటిషనర్లపై కఠిన చర్యలు తీసుకోరాదంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తున్నట్లు తెలిపారు.
Telangana High Court Fires on APCID: జోక్యం చేసుకున్న మార్గదర్శి తరఫు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది నాగముత్తు.. దర్యాప్తు వివరాలను అధికారులు మీడియా సమావేశం పెట్టి వెల్లడిస్తున్నారని, దానిపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. దీనిపై ప్రస్తుతం ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని, కౌంటర్లు దాఖలు చేసిన తర్వాతే పరిశీలిస్తామని న్యాయమూర్తి చెప్పారు. ఇక్కడ ఉన్న అన్ని పిటిషన్లు తన పరిధిలో లేవని, కొన్ని కేసులను కొట్టివేయాలని కూడా వేశారని, వీటిపై తాను విచారించలేనని, కౌంటర్లు దాఖలు చేసిన తరువాత పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
Margadarsi: మార్గదర్శిపై ప్రతీకారాత్మక దాడి.. ఏపీ సీఐడీ ఆరోపణలను నిర్ద్వంద్వంగా ఖండించిన సంస్థ
ప్రతిరోజూ మీడియా సమావేశం పెట్టి దర్యాప్తు వివరాలు వెల్లడిస్తున్నారని సీనియర్ న్యాయవాది మరోమారు చెప్పడంతో.. మీడియా సమావేశం ఎందుకు నిర్వహిస్తున్నారు, ఏ అధికారంతో నిర్వహిస్తున్నారని న్యాయమూర్తి ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించారు. ఫిర్యాదులు అందాయని, పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేస్తామని ప్రభుత్వ న్యాయవాది జవాబిచ్చారు. దర్యాప్తు వివరాలు మీడియాకు వెల్లడించకుండా నియంత్రణలో ఉండాలని అధికారులకు చెబుతానని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. కౌంటర్లు దాఖలు చేశాక అన్ని అంశాలను పరిశీలించి.. తగిన ఉత్తర్వులు జారీ చేస్తామంటూ విచారణను వాయిదా వేశారు.