ప్రశ్న: 'సార్.. మీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాం. ఈ యాప్‌తో ఫోన్ కాల్స్‌ను ట్యాప్ చేయటం ఎలాగో చెప్పండి?'
జవాబు: మీరు అనుకున్నటువంటి యాప్ కాదు. ఇది కేరళలోని పీఎస్సీ కోచింగ్ సెంటర్‌కు చెందినది. కేవలం చదువుకు సంబంధించినవే మీరు తెలుసుకోగలరు.
ప్రశ్న: లేదు సర్. మీ యాప్ పేరు పెగాసస్ కదా?
జవాబు. అవును
ప్రశ్న: అయితే.. మీరు ఫోన్ కాల్స్‌ను ఎందుకు లీక్ చేయలేకపోతున్నారు?
ఈ సంభాషణ.. ఓ కోచింగ్ సెంటర్ సిబ్బంది, కాలర్ మధ్య జరిగినది. మా యాప్ అలాంటిది కాదు బాబోయ్ అని మొత్తుకున్నా.. రోజుకు రెండో మూడో ఇలాంటి కాల్స్ వస్తూనే ఉన్నాయంటున్నారు నిర్వాహకులు. అంతటికీ కారణం.. వారి యాప్ పేరు 'పెగాసస్' కావటమే!
కేరళ, కోజికోడ్‌లోని కోయిలాండి ప్రాంతంలో 'పెగాసస్' అనే పేరుతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ కోచింగ్ సెంటర్ ఉంది. కరోనా కారణంగా గత ఏడాది లాక్డౌన్ విధించిన క్రమంలో మూతబడింది. అయితే.. విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని 'యాప్'ను అందుబాటులోకి తెచ్చారు నిర్వాహకులు పీసీ సనూప్, ఆయన స్నేహితుడు అబిన్. గూగుల్ ప్లే స్టోర్‌లో ఈ యాప్ అందుబాటులో ఉంది. దీనిని డౌన్లోడ్ చేసుకుని ఆన్లైన్ క్లాసులు వినొచ్చు.
ఇటీవల ఈ యాప్ డౌన్లోడ్లు రెండితలయ్యాయి. అలాగే.. కోచింగ్ సెంటర్‌కు కాల్స్ పెరిగాయి. "యాప్ డౌన్లోడ్ చేసుకున్నాం. ఫోన్ కాల్స్ ట్యాప్ చేయటం ఎలాగో చెప్పండి?" అనే ప్రశ్న అక్కడి సిబ్బందిని ఇబ్బందులకు గురి చేస్తోంది.
" కొవిడ్ కారణంగా లాక్డౌన్ విధించటం వల్ల 2020, జూన్ నుంచి ఆఫ్‌లైన్ క్లాసులు జరగటం లేదు. అప్పటి నుంచి ఆన్లైన్ క్లాసులు చేపడుతున్నాం. పెగాసస్ ఆన్లైన్ పేరుతో యాప్ తీసుకొచ్చాం. ప్రస్తుతం పెగాసస్ స్పైవేర్ అంశం వెలుగులోకి వచ్చింది. అంతకు ముందు మా యాప్ వెయ్యి డౌన్లోడ్స్ ఉండేవి.పెగాసస్ విషయం తెలిశాక మరో 1200 డౌన్లోడ్స్ అదనంగా పెరిగాయి. మొత్తం 2200కు చేరింది. ఎక్కువగా ఉత్తర భారతం నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి."
- పీసీ సనూప్, కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు.
రోజురోజుకు అలాంటి ఫోన్ కాల్స్ పెరగటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెబుతున్నారు కోచింగ్ సెంటర్ సిబ్బంది. చాలా వరకు ఉత్తర భారతం నుంచి కాల్స్ వస్తున్నట్లు తెలిపారు. వారికి కావాల్సింది కేవలం ఫొన్ కాల్స్ లీక్ చేయటమేనని పేర్కొనటం గమనార్హం.
ఇదీ చూడండి: 'పెగాసస్' పెనుభూతం.. మీ ఫోనూ హ్యాక్ కావచ్చు!