Gazette establishing R5 zone : రాజధాని ప్రాంతంలో ఆర్5 జోన్ విషయంలో ప్రభుత్వం ముందడుగు వేసింది. పేదల ఇళ్ల నిర్మాణం కోసమంటూ ప్రత్యేకంగా ఆర్ 5 జోన్ ఏర్పాటు చేస్తూ గెజిట్ జారీ చేసింది. మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు, తుళ్లూరు మండలం మందడం, ఐనవోలు గ్రామాల పరిధిలో 900 ఎకరాల భూములను ఆర్ 5 జోన్ పరిధిలోకి తీసుకొచ్చింది. 2022 అక్టోబర్ లో సీఆర్డీఏ చట్టాన్ని సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
హైకోర్టు ఆదేశాలతో గ్రామసభలు.. ప్రభుత్వ నిర్ణయాన్ని రాజధాని రైతులు వ్యతిరేకించారు. కనీసం రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకపోవటంపై అప్పట్లో కోర్టుకు వెళ్లారు. రైతుల అభ్యంతరాలను విజయవాడ సీఆర్డీఏ కార్యాలయానికి వచ్చి చెప్పాలన్నారు. అయితే గ్రామసభల ద్వారానే అభిప్రాయసేకరణ జరగాలని రైతులు కోర్టుకు విన్నవించారు. దీంతో గ్రామసభలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో రాజధాని గ్రామాల్లో అధికారులు గ్రామసభలు నిర్వహించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని రాజధాని రైతులంతా మూకుమ్మడిగా వ్యతిరేకించారు. అమరావతి బృహత్ ప్రణాళికను విచ్ఛిన్నం చేసేలా ప్రభుత్వ నిర్ణయం ఉందన్నారు. సీఆర్డీఏ చట్ట సవరణ చేయొద్దని అధికారుల సమక్షంలో అన్ని గ్రామాల్లోనూ ఏకగ్రీవ తీర్మానాలు చేశారు.
రైతుల అభిప్రాయాన్ని పట్టించుకోకుండా... అయితే రైతుల అభిప్రాయాన్ని పట్టించుకోకుండా ప్రభుత్వం తరపున సీఆర్డీఏ కమిషనర్ ఇవాళ ఆర్ 5 జోన్ గెజిట్ విడుదల చేశారు. ఈ నెల 17వ తేదీన జరిగిన సీఆర్డీఏ కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో ఆర్ 5 జోన్ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నట్లు గెజిట్లో పేర్కొంది. పేద వర్గాల ఇళ్ల కోసం భూములు కేటాయిస్తున్నట్లు వివరించింది. ఎక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపడతారో, ఎంత విస్తీర్ణంలో చేపట్టాలనేది గెజిట్లో పొందుపర్చారు. సీఆర్డీఏ విడుదల చేసిన గెజిట్ పై రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేసేందుకు రైతులు సిద్ధమయ్యారు. న్యాయనిపుణులతో చర్చించి ముందుకెళ్తామన్నారు.
ఆగ్రహం వెల్లువ... న్యాయపోరాటానికి సన్నద్ధం.. రాజధానిలో ఆర్ జోన్ 5 ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం విడుదల చేసిన రాజపత్రంపై అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని అంశం కోర్టు పరిధిలో ఉన్నందున ప్రభుత్వం రాజపత్రం ఎలా విడుదల చేస్తుందని రైతులు ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని న్యాయస్థానంలో సవాలు చేస్తామని తేల్చిచెప్పారు. ముఖ్యమంత్రిగా జగన్ ఉన్నంతకాలం తాము న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సిందేనని వాపోయారు. . గ్రామసభల్లో ప్రజలంతా ప్రభుత్వ నిర్ణయాన్ని తిరస్కరించినా... ప్రభుత్వం గుడ్డిగా ముందుకు వెళ్తోందని అసహనం వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వ నిర్ణయాన్ని కచ్చితంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. రాజధాని అభివృద్ధిని పక్కదోవ పట్టించడానికే ప్రభుత్వం రాజధానిలో ఆర్ జోన్ 5 తెరపైకి తీసుకొచ్చిందని ఆరోపించారు.
ఇవీ చదవండి :