సాగు చట్టాల అమలు త్వరితగతిన జరగకపోతే 2022 కల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరదని అభిప్రాయపడ్డారు నీతి ఆయోగ్ సభ్యుడు రమేశ్ చంద్. సాగు చట్టాల రద్దు కోరుతూ ఉద్యమం చేస్తున్న రైతు సంఘాలు... చట్టంలోని ప్రతి క్లాజ్‌ను క్షణ్నంగా చర్చించాలనే ప్రభుత్వ ప్రతిపాదనకు అంగీకరించాలని కోరారు.
"ప్రభుత్వం ఏడాదిన్నర పాటు సాగు చట్టాల అమలను నిలిపివేస్తామని రైతు సంఘాల నేతలకు తెలిపింది. చట్టంలోని ప్రతి క్లాజ్‌ను రైతు నేతలతో చర్చించేందుకు సిద్ధంగా ఉందని పేర్కొంది. ఈ అవకాశాన్ని వారు ఉపయోగించుకోవాలి. బాగా ఆలోచించి చర్చలకు సిద్ధం కావాలి. చట్టంలోని ఏ అంశం వారికి వ్యతిరేకంగా ఉందో స్పష్టంగా చెప్పాలి."
--రమేశ్ చంద్, నీతి ఆయోగ్ సభ్యుడు.
అధికార పార్టీ ఏది అమలు చేయాలనుకున్నా ప్రతిపక్షాలు దాన్ని విమర్శిస్తున్నాయని రమేశ్ చంద్ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో మార్పు తీసుకురావడం కష్టమవుతుందని అన్నారు. జన్యుపరంగా మార్పు చెందిన పంటల విషయంపై మాట్లాడిన చంద్.. అన్ని చోట్లా ఈ పంటలు పండించకూడదనే మొండి ప్రవర్తనతో ఉండకూడదని అన్నారు. కొన్ని చోట్ల ఈ పంటల అవసరం ఉందని తెలిపారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగం 3 నుంచి 3.5 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేశారు.
ఇదీ చదవండి:'భాజపాకు బంగాల్లో మెజారిటీ- అసోంలో అధికారం'