తమిళనాడులోని త్రిచీకి చెందిన ఈమె పేరు పాట్రిసియా మేరి. ఏడు సంవత్సరాల క్రితం ఆమె భర్త రుబన్ షణ్ముగనాథన్.. రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఒంటిరిదైన ఆమె తన ఇద్దరి పిల్లల్ని పోషించాల్సిన బాధ్యతను తలకెత్తుకుంది. భర్త సంపాదించిన ఆస్తి అంటూ ఏమీ లేదు. చింతమాణి పట్టణంలో ఉన్న ఒక్క సెలూన్ షాపు తప్ప. షాపులో పని చేయడానికి ఎందరో పురుషుల్ని బతిమిలాడింది. అయినా ఎవరూ ముందుకు రాలేదు. దాంతో తనే కత్తెర పట్టింది. హెయిర్ కటింగ్ చేయడం మొదలెట్టింది. మహిళ దగ్గర ఎవరు హెయిర్ కటింగ్ చేయించుకుంటారంటూ ఆమె సెలూన్ వైపు పురుషులు రాలేదు. అయినా ఆమె ఆందోళన చెందలేదు. రానురాను ఆమె చేస్తున్న హెయిర్ స్టైల్ తీరును చూసి ఆ సెలూన్‌కు వచ్చే వారి సంఖ్య క్రమక్రమంగా పెరిగింది.
"ఏడేళ్ల నుంచి హెయిర్ కటింగ్ వృత్తిలో ఉన్నాను. నా భర్త చనిపోయినప్పుడు చాలా వేధన అనుభవించాను. పిల్లల్ని ఎలా పోషించడం అని తీవ్రంగా మథన పడ్డాను. నా భర్త సెలూన్ షాప్‌లో పనిచేయమని ఎందరో పురుషుల్ని అడిగాను. ఎవరూ ముందుకు రాలేదు. దాంతో నేనే హెయిర్ కటింగ్ చేయడం మొదలెట్టాను. కేవలం నగరాలు, పట్టణాలలోని సెలూన్ షాప్‌లలో మాత్రమే మహిళలు పని చేస్తారు. మొదట నా షాప్‌నకు ఎవరూ వచ్చేవారు కాదు. వచ్చినా కుర్చీలో కూర్చోని వెంటనే వెళ్లిపోయేవారు. కానీ రానురాను నేను చేస్తున్న హెయిర్ స్టైల్ చూసి చాలా మంది వస్తున్నారు. ఈ షాప్ ద్వారా వచ్చే కొద్ది ఆదాయంతో ఇల్లు గడుస్తోంది. నా పిల్లల్ని చదివించగలుగుతున్నాను."
-పాట్రిసియా మేరి, సెలూన్ షాపు యజమాని
సెలూన్‌కి వచ్చే చాలా మంది పురుషులు ఆమె చేస్తోన్న హెయిర్ స్టైల్ పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
"చాలా సంవత్సరాలనుంచి ఇక్కడికి వస్తున్నాను. మొదట మహిళ దగ్గర హెయిర్ కట్ చేయించుకోవడమేంటని ఇక్కడికి రాలేదు. కానీ హెయిర్ స్టైల్ బాగా ఉండడం వల్ల ఇక్కడి వస్తున్నాను. చాలా మంది స్థానికులు ఇక్కడికి హెయిర్ కట్ చేయించుకోవడానికి వస్తున్నారు."
-శేఖర్, స్థానికుడు
ఇదీ చూడండి: భారత్ 'మాస్టర్ స్ట్రోక్' వల్లే తోకముడిచిన డ్రాగన్!