తమిళ పార్టీలను తెలుగు వారూ ప్రభావితం చేస్తున్నారు. తమిళుల తరువాత రాష్ట్రంలో తెలుగులో మాట్లాడే వారే అత్యధిక సంఖ్యలో ఉన్నారు. దీనికి తగ్గట్లు అన్నాడీఎంకే, డీఎంకే తెలుగు మాతృభాషగా కలిగిన వారికి సీట్లు కేటాయించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న చత్మురఖ పోటీలో తెలుగువారి ఓట్లను పొందేందుకు తమిళ పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
అన్నాడీఎంకే తరఫున..
తాంబరం, తిరుపూరు జిల్లా అవినాశి, తూత్తుకుడి జిల్లా కోవిల్‌పట్టి, కృష్ణగిరి జిల్లా హోసూరు, చెన్నైలోని టి.నగర్, కొళత్తూరు, ఆర్కేనగర్, విల్లివాక్కం, ధర్మపురి జిల్లా పాపిరెడ్డిపల్లిలో తెలుగు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
![tamil-nadu-political-parties-special-focus-on-telugu-votes](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11053136_ghpolitics-1d_1-3.jpg)
డీఎంకే తరఫున..
తిరుచ్చి వెస్ట్, తిరువణ్ణామలై, చెన్నైలోని అన్నానగర్, హార్బర్, సైదాపేట, కృష్ణగిరి జిల్లా హోసూరు ప్రాంతాల నుంచి తెలుగు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
ఆనాటి నుంచీ..
ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆంధ్ర కూడా భాగంగా ఉండేది కాబట్టి తెలుగువారి ప్రాబల్యం నాటి నుంచి ఇప్పటికీ తమిళనాట కొనసాగుతునే ఉంది. మద్రాస్ నగర పాలక సంస్థ మొదటి మేయర్ పిట్టి త్యాగరాజ చెట్టి కూడా తెలుగువారే. మద్రాస్ ప్రెసిడెన్సీలో పనగల్ రాజ, బి.మునస్వామి, బొబ్బిలిరాజ, టంగుటూరి ప్రకాశం, ఓమందూరు రామస్వామిరెడ్డియార్, కుమారస్వామి రాజాల పాలన సాగింది. వీరంతా తెలుగు నేపథ్యం కలిగిన వారే కావడం గమనార్హం. డీఎంకేలో దురైమురుగన్ వంటి సీనియర్ నేతలు తెలుగు వారే. డీఎండీకే పార్టీ వ్యవస్థాపకుడు విజయ్‌కాంత్, ఎండీఎంకే నేత వైగోలూ తెలుగువారే కావడం గమనార్హం.
సినీ పరిశ్రమ తరలివెళ్లాక..
2011 జనాభా లెక్కల సంగతి ఎలా ఉన్నా.. 2013లో ఓ స్వచ్ఛంద సంస్థ జరిపిన అధ్యయనంలో మాత్రం తమిళనాట తెలుగు జనాభా 27% ఉన్నట్లు తేలింది. వాస్తవానికి ఒకప్పుడు తెలుగు వారి శాతం తమిళనాడులో 40% వరకు ఉందని, రికార్డుల్లో కొన్నిచోట్ల తెలుగు పేర్లను తమిళీకరణ చేయడంతో జనాభా తక్కువ సంఖ్యలో ఉన్నట్లు నమోదైందని పలు తెలుగు సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్‌కు తరలివెళ్లాక క్రమంగా తెలుగు జనాభా రాష్ట్రంలో ముఖ్యంగా చెన్నైలో తగ్గుముఖం పట్టింది.
![tamil-nadu-political-parties-special-focus-on-telugu-votes](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11053136_ghpolitics-1d_1-2.jpg)
ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, ఇతర జిల్లాలకు చెందిన ప్రజలు అత్యధిక సంఖ్యలో చెన్నై చుట్టుపక్కల స్థిరపడ్డారు. నాయుడు(కాపు), కమ్మనాయుడు, రెడ్డి, కొండరెడ్డి, ఆర్యవైశ్య, క్షత్రియ, బ్రాహ్మణులు, ఆదిఆంధ్ర, అరుంధతియర్ల్లు, బేరివైశ్య, 24-మనై తెలుగు చెట్టియార్‌లు, గొల్ల, యాదవ, క్షత్రియ, పద్మశాలి తదితర సామాజిక వర్గాలకు చెందిన వారు తమిళనాడులో ఉన్నారు. మదురై ప్రాంతంలోని నాయకర్లు (నాయుడు సామాజికవర్గం) ఒక బలమైన శక్తిగా ఉంది. వీరి ఓటు బ్యాంకును ఆకర్షించడానికి తిరుమలనాయకర్ జయంతిని రాష్ట్ర వేడుకగా తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.ఈరోడ్డు జిల్లా గోపిచెట్టిపాళెంలో 16.14% చొప్పున తెలుగు వారు ఉన్నారు. చెన్నై, కాంచీపురం జిల్లాల్లో అయితే అధిక శాతంలో తెలుగు ఓటర్లే ఉన్నారు. శ్రీపెరంబుదూరు, కాంచీపురం, చెన్నై శివార్లలోని హార్బర్, ఆవడి, కొళత్తూరు, వేళచ్చేరి, అన్నానగర్, విరుగుంబాక్కం, ఆర్.కె.నగర్ తదితర ప్రాంతాల్లో తెలుగు ఓటర్లు కీలకంగా వ్యవహరిస్తున్నారు. కోవిల్‌పట్టి, విళాత్తికుళం, విరుదునగర్, సాత్తూర్, రాజపాళెయం, శ్రీవిళ్లిపుత్తూరు, పెరియకుళం, తళి, సేలం, ఆండిపట్టి, సింగానల్లూరు, తేని, బర్గూరు, గుడియాత్తం, ఇతర ప్రాంతాల్లోనూ తెలుగువారి ప్రభావం ఎక్కువే.
![tamil-nadu-political-parties-special-focus-on-telugu-votes](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11053136_ghpolitics-1d_1-1.jpg)
ఇదీ చదవండి: