Professor Saibaba Supreme Court: మావోయిస్టులతో సంబంధాల కేసులో నిర్దోషిగా తేలిన దిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జి.ఎన్. సాయిబాబాకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు(నాగ్‌పుర్ బెంచ్) ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు నిలిపివేసింది. ఈ మేరకు శనివారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సాయిబాబా సహా మిగతావారిని జైలు నుంచి విడుదల చేయడంపై స్టే విధించింది. తన వైకల్యాన్ని దృష్టిలో ఉంచుకుని తనను గృహ నిర్బంధంలో ఉంచాలని సాయిబాబా అభ్యర్థించగా.. దీనికి కూడా న్యాయస్థానం నిరాకరించింది.
మావోయిస్టులతో సంబంధాల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ప్రొఫెసర్ సాయిబాబా సహా మరో ఐదుగురిని బాంబే హైకోర్టు శుక్రవారం నిర్దోషులుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఏదైనా ఇతర కేసులో కస్టడీ అవసరమైతే తప్ప, ఆయనను తక్షణమే నాగ్‌పుర్ జైలు నుంచి విడుదల చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. అయితే ఈ తీర్పుపై మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ అప్పీల్‌పై నేడు విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. హైకోర్టు తీర్పును సస్పెండ్ చేసింది. మహారాష్ట్ర పిటిషన్‌పై నాలుగు వారాల్లోగా తమ స్పందన తెలియజేయాలంటూ సాయిబాబా, ఇతర నిందితులను ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను డిసెంబరు 8వ తేదీకి వాయిదా వేసింది. సుప్రీం ఉత్తర్వుల నేపథ్యంలో వారి జీవిత ఖైదు శిక్ష కొనసాగనుంది.
దేశంపై యుద్ధం చేస్తున్నారని, మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని 2014లో 90% వైకల్యంతో వీల్‌ఛైర్‌కు పరిమితమైన సాయిబాబా, మరో ఐదుగురిని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో 2017లో సెషన్స్ కోర్టు వారికి జీవిత ఖైదు విధించింది. అప్పటి నుంచి ఆయన నాగ్‌పుర్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే సెషన్స్ కోర్టు విధించిన జీవిత ఖైదును సవాల్ చేస్తూ సాయిబాబా సహా ఇతర నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. కాగా.. అరెస్టు నేపథ్యంలో 2014లో సాయిబాబాను దిల్లీ యూనివర్సిటీ సస్పెండ్ చేసింది. గతేడాది ఆయనను పూర్తిగా విధుల నుంచి తొలగించింది.