Supreme Court on Margadarsi Case: మార్గదర్శి కేసు విచారణలో తెలంగాణ హైకోర్టు న్యాయపరిధిని సవాల్ చేస్తూ.. దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ అవసరం లేదని స్పష్టం చేస్తూ... కేసుపై విచారణను ముగిస్తూ.. సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించిన విషయాలు అన్నీ తెలంగాణ హైకోర్టులోనే తేల్చుకోవాలని నిర్దేశించింది. అదే సందర్భంలో... రామోజీరావు, శైలజా కిరణ్ లపై కఠిన చర్యలు తీసుకునే విషయంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన రెండు ఎస్ఎల్పీలను డిస్మిస్ చేసింది.
మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థపై ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులు నమోదు చేసిన కేసులకు సంబంధించిన అంశాలను విచారించే న్యాయపరిధి తమకు ఉందని తెలంగాణ హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులపై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ.. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం విచారణను ముగించింది. ఈ అంశంపై హైకోర్టులోనే తుది వాదనలు వినిపించుకోవాలని స్పష్టం చేసింది.
న్యాయపరిధి అన్నది కేసులోని ప్రధాన అంశం... అందువల్ల మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టడానికి బదులు దాన్ని డిస్పోజ్ చేయడమే మేలని భావించాం అని జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ల ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ కేసును హైకోర్టు, మెరిట్ ప్రాతిపదికన విచారించి నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడుతున్నాం అని వ్యాఖ్యలు చేసింది. ఒకవేళ ఏదైనా సందర్భం ఎదురైతే పిటిషనర్ మళ్లీ ఈ కోర్టుకు వచ్చి, అప్పుడు న్యాయ పరిధి( జ్యూరిస్ డిక్షన్) అంశాన్ని సవాలు చేసే స్వేచ్ఛ ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వుల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన ట్రాన్సఫర్ పిటిషన్లకు మనుగడ లేకుండా పోయింది కాబట్టి అవి "వృధాగా మారాయి" అని ధర్మాసనం పేర్కొన్నది.
మార్గదర్శి సంస్థ చైర్మన్ రామోజీరావు, ఎండీ శైలజాకిరణ్లపై కఠిన చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈకేసు విచారణ ప్రారంభమైన వెంటనే జస్టిస్ జేకే మహేశ్వరి స్పందిస్తూ... ఈ అంశానికి సంబంధించి కొన్ని కేసుల్లో ఇంకా నోటీసులు అందలేదని, ఆ కేసుల్లో కూడా నోటీసులు అందిన తర్వాత తాము తదుపరి వాదనలు వింటామని పేర్కొన్నారు. అందుకు ఏపీ ప్రభుత్వం తరుపున సీనియర్ న్యాయవాది మణిందర్ సింగ్ బదులిస్తూ... తాము ప్రతివాదులందరికీ నోటీసులు పంపిణీ చేస్తామన్నారు. దీనికి జస్టిస్ జేకే మహేశ్వరి జోక్యం చేసుకుంటూ ట్రాన్సఫర్ పిటిషన్లను పెండింగ్‌లో పెట్టి, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులకు సంబంధించిన మిగిలిన రెండు పిటిషన్ల గురించి చూద్దాం అన్నారు.
ఈ సందర్భంలో... తర్వాత జస్టిస్ కేవీ విశ్వనాథన్ జోక్యం చేసుకుంటూ... "ఇందులో ఆదేశాలు... న్యాయపరిధికి సంబంధించినది కాబట్టి.... అక్కడ మీరు దాఖలు చేసిన కేసును విచారణకు అనుమతిస్తే మెరిట్స్ ఆధారంగా వాదనలు వినిపించండి, ప్రస్తుతానికి కేసుపై విచారణ తెలంగాణ హైకోర్టులోనే జరుగుతుంది కదా అన్నారు. ఒకవేళ అక్కడ కేసును తోసిపుచ్చితే... తదుపరి ప్రశ్నలేమీ ఉత్పన్నం కావని జస్టిస్ విశ్వనాథన్ అన్నారు. ఒకవేళ పిటిషన్ అనుమతిస్తే మీరు ఇక్కడికి వచ్చి... న్యాయపరిధి గురించి వాదనలు వినిపించవచ్చు" అని పేర్కొన్నారు. తర్వాత జస్టిస్ జేకేమహేశ్వరి స్పందిస్తూ కేసును మెరిట్స్ ఆధారంగానే విచారిస్తారు. ఒకవేళ మెరిట్స్ ఆధారంగా పిటిషను డిస్మిస్ చేస్తే మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం ఉండదు... ఒకవేళ డిస్మిస్ చేయకపోతే జ్యూరీస్‌డిక్షన్ అంశాన్ని సుప్రీం కోర్టులో ప్రస్తావించడానికి వీలుంటుంది అన్నారు. ఆ సమయంలో మార్గదర్శి సంస్థ తరుపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్కీ జోక్యం చేసుకుంటూ... ఈకేసులో ఇప్పటికే కొన్ని ఎఫ్ఐఆర్ లపై ఆంధ్రప్రదేశ్ లో చార్జిషీట్లు కూడా దాఖలు చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు. తర్వాత ఏపీ ప్రభుత్వం తరుపున మరో సీనియర్ న్యాయవాది నీరజ్ కిషన్ కౌల్ వాదనలు వినిపించగా అందుకు న్యాయమూర్తులు జస్టిస్ జేకేమహేశ్వరి, జస్టిస్ విశ్వనాధన్ జోక్యం చేసుకుంటూ... న్యాయపరిధి విషయం ఓపెన్ గా ఉంది... తెలంగాణ హైకోర్టులో మీకు వ్యతిరేకంగా తీర్పువస్తే, మీరు ఈ కోర్టుకు రావొచ్చు అని చెప్పారు. దీనికి నిరజ్ కిషన్ కౌల్ స్పందిస్తూ... ఒక ఎఫ్ఐఆర్ లో ఇప్పటికే ఛార్జిషీట్ దాఖలైంది.... అందులోని అభియోగాలను ఆంధ్రప్రదేశ్ లోని ట్రయల్ కోర్టు ఖరారు చేస్తుంది. మరోవైపు ఎఫ్ఐఆర్ లపై తెలంగాణ హైకోర్టు విచారణ చేస్తుంది.... ఎఫ్ఐఆర్ లలో పేర్కొన్న ప్రతి ఆరోపణా ఆంధ్రప్రదేశకు సంబంధించినవే... అలాంటి విషయాల్లో తెలంగాణ హైకోర్టు ఎలా జోక్యం చేసుకుంటుంది అని ప్రశ్నించారు. ఆ వాదనలతో న్యాయమూర్తులు ఇద్దరూ ఏకీభవించలేదు. ఈ సందర్భంలో జస్టిస్ మహేశ్వరి స్పందిస్తూ... ఈ కేసు ప్రకారం కొన్ని చిట్ ఫండ్ కంపెనీ కార్యాలయాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి... అక్కడ వసూలు చేసిన నిధులను హైదరాబాద్ లోని ప్రధాన కార్యాలయానికి తరలిస్తున్నారని, అక్కడి నుంచి నిధులను వివిధ కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారని చెబుతున్నారు. ఇది సింపుల్ కేసు కాదు... అని గుర్తు చేశారు.
తర్వాత ఏపీ ప్రభుత్వం తరుపున నీరజ్ కిషన్ కౌల్ వాదిస్తూ... ఇక్కడ కంపెనీ చిట్ ఫండ్ బ్రాంచ్ లకు ప్రత్యేక స్వతంత్ర ఖాతాలు నిర్వహించకుండా ఉద్దేశపూర్వకంగా డబ్బు మొత్తాన్ని ఒక కార్పొరేట్ అకౌంట్ లో జమ చేసి, అక్కడి నుంచి మళ్లిస్తున్నారన్నది ప్రధాన ఆరోపణ, అలాగే ప్రత్యేక ఖాతాల బ్యాలెన్స్ షీట్లు నిర్వహించడం లేదు. చిట్ పాడుకున్న వ్యక్తి సెక్యూరిటీ సమర్పించి.. డబ్బు మొత్తం తీసుకోవాలి. అయితే ఈ సంస్థ ప్రతినిధులు చట్ట విరుద్ధంగా తాము వడ్డీ ఇస్తాం... డబ్బును డిపాజిట్ చేయొద్దని చెబుతున్నారు... ఒక రాష్ట్రంలో నిధులను దుర్వినియోగం చేసి, మరో రాష్ట్రంలో వాటిని మ్యూచువల్ ఫండ్ కి మళ్లిస్తున్నారు. అంతిమంగా డబ్బును తిరిగి చెల్లించాల్సింది. ఆంధ్రప్రదేశ్ లొనే... అందువల్ల మ్యూచువల్ ఫండ్లకు హైదరాబాద్ నుంచి నిధులు వెళ్లాయి కాబట్టి అది తెలంగాణ హైకోర్టు పరిధిలోకి వస్తుందని చెప్పడం సబబు కాదు అని వాదనల్లో పేర్కొన్నారు. ఇక్కడ ఫోర్మెన్, సాక్షులు అంతా ఆంధ్రప్రదేశ్ లొనే ఉంటున్నారు కాబట్టి... విచారణ అక్కడే జరగాల్సి ఉందన్నారు. దీనికి జస్టిస్ విశ్వనాథన్ స్పందిస్తూ... ఇక్కడ వినిపించే వాదనలు, ఇక్కడ వినియోగించే సమయాన్ని అక్కడ ప్రధాన కేసులో వాదనలు వినిపించడానికి ఉపయోగిస్తే బాగుంటుంది... మెరిట్స్ ప్రాతిపదికన కేసును విచారించి జ్యూరిస్‌డిక్షన్ విషయంలో మీ వాదనలను పరిగణలోకి తీసుకుంటే మీకు రక్షణ లభిస్తుంది. ఒకవేళ తీర్పు వ్యతిరేకంగా "వస్తే ఇక్కడికి రండి" అని ఏపీ ప్రభుత్వం తరుపు న్యాయవాదికి సూచించారు.
ఈ సమయంలో మార్గదర్శి సంస్థ తరుపు న్యాయవాది ముకుల్ రోహత్కీ జోక్యం చేసుకుంటూ... తెలంగాణ హైకోర్టు తనకు ఈ కేసులను విచారించే న్యాయపరిధి ఉందని ఉత్తర్వులిస్తే ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన ట్రాన్సఫర్ పిటిషన్లకు విలువ ఉండదని, అవి వృధాగా మిగిలిపోతాయని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఏపీ ప్రభుత్వ తరుపు న్యాయవాది మణిందర్ సింగ్ ప్రస్తుతం కనీసం ట్రాన్సఫర్ పిటిషన్ పై విచారించాలని కోరగా..... అందుకు ధర్మాసనం విముఖత చూపింది. అన్ని విషయాలూ హైకోర్టునే చూడనివ్వండి అని జస్టిస్ మహేశ్వరి పేర్కొన్నారు కేసులోని పూర్వాపరాలు, పరిధి ప్రకారం హైకోర్టునే విచారించనివ్వండి, అక్కడ మీరు కూడా మీరి వాదనలు చెప్పుకోండి అని సూచించారు. అందుకు న్యాయవాది మణిందర్ సింగ్ స్పందిస్తూ ఈ కేసును పెండింగ్ లో ఉంచాలని కోరగా అందుకు కూడా న్యాయమూర్తి నిరాకరించారు. దానివల్ల ఏం ప్రయోజనం ఉంటుంది. అనవసరంగా హైకోర్టు మెడపై కత్తి వేలాడుతుంటుందని వ్యాఖ్యానిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
చిట్ ఆడిటర్ని నియమించడాన్ని తప్పుబడుతూ తెలంగాణ హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను డిస్మిస్ చేసింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి తాము నిరాకరిస్తున్నట్లు జస్టిస్ జేజేమహేశ్వరి స్పష్టం చేస్తూ... కేసు విచారణను ముగించారు.