ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో తలెత్తిన భద్రతా లోపంపై దర్యాప్తు చేపట్టేందుకు స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది సుప్రీంకోర్టు. దీనికి సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వం వహించనున్నారు. కమిటీలో సభ్యులుగా చండీగఢ్ డీజీపీ, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, ఎన్ఐఏ ఐజీ, ఐబీ అధికారులు ఉండనున్నారు. అలాగే.. ప్రధాని పర్యటనలో భద్రత లోపంపై కేంద్రం, పంజాబ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీల దర్యాప్తును నిలివేసింది సుప్రీం కోర్టు.
ప్రధాని భద్రతా లోపంపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేపట్టాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టింది భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం.
ఈ సందర్భంగా.. పంజాబ్ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ డీఎస్ పట్వాలియా పలు విషయాలు కోర్టుకు తెలిపారు. పంజాబ్, హరియాణా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు రికార్డులు అప్పగించినట్లు చెప్పారు. సుప్రీం కోర్టులో విచారణకు ముందే.. పంజాబ్ అధికారులను దోషులుగా చిత్రీకరిస్తూ క్రమశిక్షాణా చర్యలు ఎందుకు తీసుకోకూడదో తెలపాలని ఏడుగురు రాష్ట్ర అధికారులకు షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిటీపై తమకు నమ్మకం లేదని.. స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసి విచారణ పారదర్శకంగా జరగాలని కోరారు.
కేంద్ర తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. కేంద్ర ప్రభుత్వ కమిటీ దర్యాప్తును నిలుపుదల చేయకముందే పంజాబ్ డీజీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు ధర్మాసనానికి తెలిపారు. ఇప్పటి వరకు కమిటీ ఎలాంటి విచారణలు చేపట్టలేదన్నారు. నిబంధనల ప్రకారం డీజీ, నిఘావిభాగం అధికారులదే బాధ్యత అని ఇందులో ఎలాంటి వివాదం లేదని తెలిపారు. రోడ్డు దిగ్బంధంపై ముందస్తుగా ఎలాంటి సమాచారం లేదన్నారు. ప్రధాని పర్యటన ముందుగానే ఖరారైందని, వాతావరణ పరిస్థితుల దృష్ట్యానే రోడ్డు మార్గాన్ని ఎంచుకున్నారని తెలిపారు. ఆ విషయం కూడా ముందుగానే రాష్ట్ర ఏజన్సీలకు సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ప్రధాని కాన్వాయ్ ముందు ఉన్న సెక్యూరిటీ వాహనం 100 మీటర్ల సమీపానికి వచ్చే వరకు పంజాబ్ అధికారులు రోడ్డు క్లియర్‌గా ఉందని తప్పుడు సమాచారం ఇచ్చారని తెలిపారు.
ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. 'ప్రధాని పర్యటనలో భద్రతా లోపం తలెత్తింది. దానిని పంజాబ్ ప్రభుత్వం సైతం అంగీకరించింది. విచారణ జరిపితే దాని పరిధి ఎంతన్నది ప్రశ్న. మీరు అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలనుకుంటే ఈ కోర్టు పరిశీలించాల్సిన అవసరం ఏమిటి?' అని ప్రశ్నించింది. కేంద్రం ముందుగానే పలానా అధికారులు బాధ్యులు అంటూ.. చర్యలకు ఉపక్రమిస్తే తమ విచారణ ఎందుకని పేర్కొంది.
ఇదీ చూడండి:
'నడిరోడ్డుపై మోదీ'.. కుట్ర ప్రకారమే జరిగిందా? రైతుల మాటేంటి?