Student Died With Heart Attack : విద్యార్థికి హార్ట్ ఎటాక్ రావటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ దుర్ఘటన పల్నాడు జిల్లాలో జరిగింది. పిడుగురాళ్ల పట్టణంలోని ఎస్సీ బాలుర హాస్టల్లో రాత్రి సమయంలో విద్యార్థి మంద కోటి స్వామి భోజనం చేశాడు. అనంతరం చదువుకునే సమయంలో ఉక్కపోతగా ఉందని స్నానం చేసేందుకు బయలుదేరాడు. అక్కడే గుండె పోటు వచ్చి కుప్ప కూలిపోయాడు. వెంటనే హాస్టల్లో ఉన్న వాచ్మెన్ విద్యార్థి స్నేహితులతో కలిసి పట్టణంలోని ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షలు నిర్వహించగా మంద కోటి స్వామి అప్పటికే మృతి చెందాడని చెప్పారు.
శోకసంద్రంలో విద్యార్థి కుటుంబం : హాస్టల్ వార్డెన్ విద్యార్థి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. గుత్తికొండ గ్రామం నుండి కుటుంబ సభ్యులు బంధువుల హాస్పిటల్ దగ్గరికి వచ్చి మృతి చెందిన కోటి స్వామి చూసి శోకసంద్రంలో మునిగిపోయారు. స్నేహితులని, హాస్టల్ వార్డెన్ ని విషయం అడిగి తెలుసుకుని కోటి స్వామి మృతదేహాన్ని స్వగ్రామమైన గుత్తికొండకు తీసుకొని వెళ్ళారు.
ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు యువకులు మృతి : వైయస్సార్ జిల్లా చెన్నూరు మండలం పాలంపల్లె వద్ద తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. ముగ్గురు యువకులు కావడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చెన్నూరు మండలం బెస్త కాలనీకి చెందిన సురేష్, దినేష్, సుబ్బయ్యలు ముగ్గురు ద్విచక్ర వాహనంపై ఒంటిమిట్ట నుంచి చెన్నూరుకు బయలుదేరారు.
తెల్లవారుజామున 5 గంటల సమయంలో పాలంపల్లె సమీపానికి రాగానే ఎదురుగా వస్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టంది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనాస్థలమంతా తీవ్ర రక్తస్రావమైంది. విషయం తెలుసుకున్న గ్రామీణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదంపై ఆరా తీశారు. మృతదేహాలను హుటాహుటిన ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. చెన్నూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెల్లవారుజాము కావడంతో డ్రైవర్లు కునుకు తీయడం వల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఓ పంచాయతీలో గొడవ.. వ్యక్తి పై పెట్రోల్ : పాత కక్షలతో నిద్రిస్తున్న వ్యక్తిపై పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘటన కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలోని కప్పట్రాళ్ల గ్రామంలో చోటు చేసుకుంది. కప్పట్రాళ్ల గ్రామానికి చెందిన కోటేష్ తన ఇంటి బయట శనివారం రాత్రి నిద్రిస్తున్న సమయంలో అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించారని భాదితుడి భార్య ఈరమ్మ తెలిపారు. ఓ పంచాయతీ విషయంలో కప్పట్రాళ్ల గ్రామానికి చెందిన వారితో కోటేష్కు గొడవ జరిగిందని, దీంతో వారు కోటేష్పై పెట్రోలు పోసి నిప్ప పెట్టారని బాధితుడి భార్య తెలిపారు. తీవ్రంగా కాలిన బాధితుడిని చికిత్స కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై దేవనకొండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి