యూపీఎస్సీ పరీక్షల్లో(upsc civil services) టాపర్‌గా నిలవటం ఆరంభం మాత్రమేనని సివిల్స్ టాపర్ శుభంకుమార్(UPSC civils topper) తెలిపారు. తదుపరి ఏ బాధ్యతలు అప్పగించినా సమర్థంగా నిర్వహిస్తానన్నారు. గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేసే అవకాశం వస్తే సంతోషిస్తానని తెలిపారు. మూడో ప్రయత్నంలో సివిల్స్ టాపర్‌గా నిలిచారు బిహార్‌కు చెందిన 24 ఏళ్ల శుభం కుమార్. ఈటీవీ భారత్ ముఖాముఖిలో పలు విషయాలు వెల్లడించారు శుభం.
- ప్రశ్న: శుభం సివిల్స్‌లో మొదటి ర్యాంక్ సాధించినందుకు ఈటీవీ తరఫున అభినందనలు. ఈ విజయంపై మీ స్పందనేంటి..?
జవాబు: మీకు కృతజ్ఞతలు. చాలా సంతోషంగా ఉంది. కుటుంబసభ్యులు, స్నేహితులు అందరూ హర్షం వ్యక్తం చేశారు. - ప్రశ్న: మీ ప్రయాణం ఎలా సాగింది. మీ స్వస్థలం ఎక్కడ..? మీ అమ్మనాన్న ఏం చేస్తారు..?
జవాబు: నాది కటిహార్ జిల్లా కుమ్రి గ్రామం. మా ఇంట్లో అమ్మానాన్న, చిన్నాన్న చిన్నమ్మ ఉంటారు. 2014-18 మధ్య ఐఐటీ బాంబేలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశా. 2018 నుంచి సివిల్స్ ప్రయత్నాలు మొదలుపెట్టా. దిల్లీలో రెండేళ్లు ఉన్నా. గతేడాది ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్ సర్వీస్‌కు ఎంపికయ్యా. ప్రస్తుతం పుణెలో శిక్షణ కొనసాగుతోంది. - ప్రశ్న: మీ అమ్మానాన్న ఏం చేస్తారు..? సివిల్స్ ప్రయత్నాలు ఎప్పట్నుంచి మొదలయ్యాయి..?
జవాబు: మా నాన్న ఉత్తర బిహార్ గ్రామీణ బ్యాంక్‌లో మేనేజర్. అమ్మ గృహిణి. చిన్నప్పటి నుంచి నాకు సివిల్స్ రాయాలనే కల ఉండేది. ఐఐటీ బాంబే చివరి సంవత్సరంలో ఉన్నప్పుడు
యూపీఎస్సీలో ప్రవేశించి ప్రజలకు సేవ చేయాలని కోరిక కలిగింది. - ప్రశ్న: 24ఏళ్ల యువకుడు.. అది బిహార్‌కు చెందినవాడు సివిల్స్‌లో టాపర్‌గా నిలవటం చిన్న విషయం కాదు. సివిల్స్ టాపర్ అని తెలిసినప్పుడు ఏమనిపించింది...?
జవాబు: చాలా సంతోషమనిపించింది. ఇంకా చాలామంది కూడా సివిల్స్‌కు ఎంపికయ్యారు. నా విజయం బిహార్ యువకులను సానుకూల ప్రేరణగా నిలుస్తుంది. - ప్రశ్న: మీ తదుపరి లక్ష్యం ఏమిటి..?
జవాబు: ఇది ఆరంభం మాత్రమే. నాకు ఏ బాధ్యతలు అప్పగించినా సమర్థంగా నిర్వహిస్తా. గ్రామీణాభివృద్ధి కోసం పనిచేసే అవకాశం వస్తే సంతోషిస్తా. - ప్రశ్న: బిహార్ సీఎంసహా దేశం నలుమూలల నుంచి మీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. మీరేమంటారు...?
జవాబు: నేను చాలా అదృష్టవంతుణ్ని. అందరికీ కృతజ్ఞతలు.
ఇదీ చూడండి: సివిల్స్ ఫలితాలు విడుదల- టాపర్‌గా శుభమ్