Son statue Tamil Nadu: అకాల మరణంతో తమను ఒంటరి చేసి వెళ్లిన కుమారుడిని మర్చిపోలేని తల్లిదండ్రులు.. అతడి జ్ఞాపకార్థం ఇంటి ముందు గుడి కట్టి విగ్రహం ఏర్పాటు చేసుకున్నారు. నిత్యం పూజలు చేస్తూ కుమారుడిపై ప్రేమను చాటుకుంటున్నారు. ఈ సంఘటన తమిళనాడులోని కాంచీపురంలో జరిగింది.
కాంచీపురానికి చెందిన కరుణాకరన్ (80) రిటైర్డ్ టీచర్, ఆయన భార్య శివగామి (75) జిల్లా రెవెన్యూ అధికారిగా బాధ్యతలు నిర్వర్తించి పదవీ విరమణ పొందారు. వారి కుమారుడు హరికరన్ (48) గతేడాది మే 10న గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆ తర్వాత తన కుమారుడి జ్ఞాపకార్థం విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు వృద్ధ దంపతులు. అందుకోసం మహాబలిపురానికి చెందిన ఓ శిల్పిని సంప్రదించారు. రూ.2.5 లక్షలు వెచ్చించి 5.3 అడుగుల విగ్రహాన్ని తయారు చేయించారు. విగ్రహం చొక్కా, ప్యాంటుకు.. హరికరన్కు ఇష్టమైన రంగులు వేయించారు. ఇంటి ముందు ప్రత్యేకంగా గదిని నిర్మించి అందులో ప్రతిష్టించారు.

తొలి వర్ధంతి సందర్భంగా ఈ నెల 9న కుటుంబసభ్యులు, స్నేహితుల సమక్షంలో విగ్రహావిష్కరణ చేశారు దంపతులు. హరికరన్ను తమ దేవుడిగా భావిస్తున్నామని, ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని చెప్పారు.


ఇదీ చూడండి: స్నేహితుడిని కలిసేందుకు దుబాయ్ వెళ్లి.. ఎమ్మెల్యే హఠాన్మరణం