Solar flare today: భానుడు బుధవారం భగభగా మండాడు. ఉదయం 9.27 నిమిషాలకు ఒక్కసారిగా భారీ స్థాయిలో సౌరజ్వాలలతో విరుచుకుపడ్డాడు. సమాచార ఉపగ్రహాలు, జీపీఎస్ వ్యవస్థల్ని దెబ్బతీసే స్థాయిలో ఈ సౌరజ్వాలలు ఉన్నాయని కోల్‌కతా కేంద్రంగా పనిచేసే సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ స్పేస్ సైన్సెస్ ఇండియా-సెస్సీ వెల్లడించింది.
"సౌర అయస్కాంత క్రియాశీల ప్రాంతమైన ఏఆర్12992 నుంచి ఉదయం 9.27గంటలకు X2.2 తరగతి సౌరజ్వాలలు వెలువడ్డాయి. భారత్, ఆగ్నేయాసియా, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో దీని ప్రభావం ఉంది. హైఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ వ్యవస్థలు స్తంభించిపోవడం, ఉపగ్రహాలు, జీపీఎస్ పనితీరులో లోపాలు, ఎయిర్‌లైన్ కమ్యూనికేషన్ వ్యవస్థ ప్రభావితం కావడం వంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది" అని వివరించారు సెస్సీ సమన్వయకర్త, కోల్‌కతాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అసోసియేట్ ప్రొఫెసర్ దివ్యేందు నంది. దీని ప్రభావాన్ని అంచనా వేసేందుకు తమ బృందం ప్రయత్నిస్తోందని తెలిపారు.
సౌర వ్యవస్థ నుంచి ఒక్కసారిగా శక్తి వెలువడడాన్ని సౌరజ్వాలలు అంటారు. వీటి వల్ల రేడియా సిగ్నళ్లు, విద్యుత్ గ్రిడ్స్, నేవిగేషన్ సిగ్నల్స్ ప్రభావితమై.. విమానాలకు, వ్యోమగాములకు ముప్పు ఏర్పడే ప్రమాదముంది. ఇలాంటి సౌరజ్వాలలు వస్తాయని ఏప్రిల్ 18నే దివ్యేందు బృందం అంచనా వేసింది. భూకంపాల తరహాలో సౌరజ్వాలలనూ నాసా తీవ్రతను బట్టి వర్గీకరిస్తుంది. ఏ నుంచి మొదలుపెట్టి బీ, సీ, ఎం, ఎక్స్ వంటి తరగతులుగా విభజించింది. బుధవారం వచ్చిన ఎక్స్ తరగతి సౌరజ్వాల.. అన్నింటికన్నా తీవ్రమైనది. ఇంకా చెప్పాలంటే ఎం తరగతి సౌరజ్వాల కన్నా 10 రెట్లు, సీ వర్గం సౌరజ్వాల కన్నా 100 రెట్లు తీవ్రతతో ఎక్స్ క్లాస్ సౌరజ్వాల ఉగ్రరూపం చూపిస్తుంది.