Zojila Pass road accident: జమ్ముకశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కార్గిల్ నుంచి శ్రీనగర్ ప్రయాణిస్తున్న ఓ ట్యాక్సీ అదుపుతప్పి 1200 అడుగుల లోయలో పడింది. ఈ ఘటనలో తండ్రీకొడుకులు సహా తొమ్మిది మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. ఒకరికి తీవ్రగాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం శ్రీనగర్- లేహ్ జాతీయ రహదారిపై జోజిలా పాస్ వద్ద బుధవారం రాత్రి జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు, ఆర్మీ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
![Zojila Pass road accident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/jk-gbl-zojilaroadaccidentleaves9passengersincludingfather-sonduodead-avb-jk10027_26052022095143_2605f_1653538903_524.jpg)
ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఏడు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని.. ఉదయం మరో రెండు మృతదేహాలను వెలికితీసినట్లు ఎస్హెచ్ఓ యూనిస్ బషీర్ తెలిపారు. వీరిలో నలుగురు గుజరాత్, ఇద్దరు జమ్ముకశ్మీర్, ఇద్దరు పంజాబ్, ఒకరు యూపీ రాష్ట్రాలకు చెందిన వారని గుర్తించారు. గాయపడిన వ్యక్తిని ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. కాగా కార్గిల్-శ్రీనగర్ మార్గంలో ఉదయం 6 గంటల తర్వాత ప్రయాణించేందుకు మాత్రమే అనుమతి ఉంది. కానీ ఈ ట్యాక్సీ నిబంధనలు ఉల్లంఘించి వెళ్లింది.
ఇదీ చదవండి: కల్తీ మద్యం కలకలం.. నాలుగురోజుల్లోనే 17 మంది మృతి!