దేశంలో రెండో దశ కరోనా విజృంభణ 100 రోజుల వరకు ఉంటుందని ఆరోగ్య నిపుణులు వెల్లడించారు. దేశ జనాభాలో కనీసం 70 శాతం మందికి టీకా పంపిణీ జరగాలని.. అంతేగాక ప్రజల్లో హెర్డ్(సామూహిక) రోగనిరోధక శక్తి పెంపొందే వరకు ఈ పరిస్థితి ఉంటుందని ప్రముఖ వైద్యుడు నీరజ్ కౌశిక్ అన్నారు. దిల్లీ పోలీసు సిబ్బందిలో 300 మంది మహమ్మారి బారిన పడిన నేపథ్యంలో అవగాహన కల్పించారాయన. ఈ క్రమంలో పలు సలహాలను పంచుకున్నారు.
కొత్తగా వ్యాప్తి చెందుతోన్న కరోనా వైరస్ పరివర్తన చెందింది. రోగనిరోధక శక్తితో పాటు వ్యాక్సిన్‌ను కూడా తట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంది. టీకా తీసుకున్న వారిలోనూ కరోనా తిరగబెట్టడానికి ఇదే కారణం. సాధారణ ఆర్టీపీసీఆర్ పరీక్షల్లోనూ పరివర్తన చెందిన వైరస్ జాడ గుర్తించలేకపోతున్నాం. అయితే వాసన కోల్పోవడం కరోనా సోకిందనేందుకు బలమైన సూచన. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి.
-నీరజ్ కౌశిక్, ప్రముఖ వైద్యుడు.
పోలీసు సిబ్బంది విధిగా వ్యాయామం చేయాలని.. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలన్నారు డాక్టర్ కౌశిక్. గతేడాది మహమ్మారి తీవ్రత ప్రారంభమైన నాటి నుంచి ఆయన దిల్లీ పోలీసులతో కలిసి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
కుటుంబంలో ఒకరికి కరోనా సంక్రమిస్తే.. మిగతా వారికీ వ్యాపిస్తోందన్నారు డాక్టర్ కౌశిక్. నివారణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని.. ముఖ్యంగా మాస్కును ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించొద్దని సూచించారు.
ఇదీ చదవండి: ఎన్ఐఏ కస్టడీకి వాజేకు సహకరించిన పోలీసు!