1993 ముంబయి బాంబు పేలుళ్ల కేసు దోషి ముహమ్మద్ మోయిన్ ఫరీదుల్లా దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఘటన సమయంలో తాను జువనైల్నని.. అందువల్ల బాలనేరస్థుల చట్టం కింద తనకు ఊరట కల్పించాలన్న మోయిన్ వాదనను తోసిపుచ్చింది.
ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టిన జస్టిస్ డీవై చంద్రచూద్, జస్టిస్ ఇందూ మల్హోత్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీతో కూడిన త్రిసభ్య ధర్మాసనం.. ఇలాంటి కేసుల్లో వెలువడిన తీర్పును ఆర్టికల్ 32 కింద పిటిషన్ వేసి మార్చలేరని తేల్చిచెప్పింది. గతంలో కింది కోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్థించిందని, టాడా(ఉగ్రవాద కార్యకలాపాల నివారణ) చట్టం కింద శిక్షకు గురైన వ్యక్తికి ఆర్టికల్ 32తో పరిష్కారం దక్కదని స్పష్టం చేసింది.
తనను దోషిగా కొనసాగిస్తూనే, ఆర్టికల్ 32ను పరిగణనలోకి తీసుకుని బాలనేరస్థులకు అందే వెసులుబాట్లు కల్పించాలని, జైలు శిక్షను రద్దు చేయాలని పిటిషర్ తన వ్యాజ్యంలో పేర్కొన్నాడు.
ఇదీ చూడండి:- 'నోటాకు మెజారిటీ వస్తే మళ్లీ ఎన్నిక!'