Khanapur Road Accident Today : రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నార్సింగి పోలీసు స్టేషన్ పరిధిలో ఈ రోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 5కు చేరింది. సరదాగా గడిపేందుకు 12 మందితో ఓఫియన్ పార్క్‌కు వెళుతున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించారు. 7 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి గురైన క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన దగ్గరలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న నార్సింగీ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కారులో ఇరుకున్న మృతదేహాలను అతి కష్టం మీద బయటకు తీసి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. లారీని వెనకాల నుంచి మితిమీరిన వేగంతో ఢీ కొట్టడంతో కారులో ఇరుక్కుని ఇద్దరు విద్యార్థినీలు, ఓ విద్యార్థి మృతి చెందారు. మృతుల్లో ఓ విద్యార్దిని దివ్యగా గుర్తించారు.
శంకర్‌పల్లి నుంచి హైదరాబాద్ వచ్చే మార్గంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. నిజాంపేట్‌కు చెందిన దివ్య.. ఆమెతో పాటు మరికొంతమంది స్నేహితులు కలిసి బ్యాచిలర్ పార్టీ నిమిత్తం గండిపేటకు వెళ్దామని ప్లాన్ వేసుకొన్నారు. వీరందరూ ఇంటర్ మొదటి సంవత్సరం, ద్వితీయ సంవత్సరం విద్యార్థిని, విద్యార్ధులు. నిజాంపేట నుంచి బయలుదేరి శంకర్‌పల్లి మీదుగా స్నేహితులను కారులో ఎక్కించుకొని 12 మంది ఓషియన్ పార్క్‌కు బయలుదేరినట్లు పోలీసులు తెలిపారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్ధారించారు. ఖానాపూర్ వైపు టిఫిన్ చేసేందుకు వెళ్లి తిరిగి రెండు, మూడు వాహనాలు ఒవర్ టేక్ చేస్తూ మితిమీరిన వేగంతో కారును నడిపినట్లు వెల్లడించారు.
ఖానాపూర్ వద్ద పోచమ్మ గుడి దేవాలయం వద్ద నిలిచి ఉన్న TS 07 UK 9738 నెంబర్ గల లారీని అతివేగంగా ఢీ కొట్టడంతో కారులో ఉన్న 12 మందిలో ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మరో ఇద్దరు చికిత్స పొందుతూ మరణించారు. ఈ ప్రమాదంలో మొత్తం మృతుల సంఖ్య 5కు చేరింది. మృతులు నిజాంపేటకు చెందిన అక్కాచెల్లెలు అర్షిత, అంకిత, నితిన్, అమృత్‌గా గుర్తించారు.
ఇవీ చదవండి: