మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, పంజాబ్లో కరోనా విజృంభణకు ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే అని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ విమర్శించారు. మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి కేంద్రం సూచనలను మహరాష్ట్ర ప్రభుత్వం పాటించిందని తెలిపారు. ఆపై పరిస్థితికి తగ్గట్లుగా చర్యలు తీసుకుందని వివరించారు. వైరస్ వ్యాప్తి విషయంలో రాష్ట్రాలను నిందించటం కేంద్రం మానుకోవాలని హితవు పలికారు.
"మహారాష్ట్రతో పాటు మిగతా రెండు రాష్ట్రాలు(ఛత్తీస్గఢ్, పంజాబ్).. వైరస్ను ఎదుర్కోవడంలో విఫలమయ్యాయని భావిస్తే.. ఆ ఓటమి తొలుత కేంద్రానిదే. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోనే మొదటి నుంచి కరోనా మహమ్మారిపై దేశం పోరాడుతోంది. భాజపా ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల్లోంచి వైరస్ అదృశ్యమైందా? వ్యాక్సిన్లను, రెమిడెసివర్ను మహారాష్ట్రకు కేంద్రం సమకూర్చాలి. భాజపా అధికారంలో ఉన్న గుజరాత్ వంటి రాష్ట్రాల్లో రెమిడెసివర్ ఔషధం దొరుకుతోంది. కానీ, మహారాష్ట్రలో మాత్రం అందుబాటులో లేదు."
- సంజయ్ రౌత్, శివసేన ఎంపీ
మహారాష్ట్ర భాజపా నేతలు రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని సంజయ్ రౌత్ విమర్శించారు.
మరోవైపు.. మహారాష్ట్ర, ఉత్తర్ప్రదేశ్, దిల్లీ, ఛత్తీస్గఢ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లోనే అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం కేసుల్లో 83.02 శాతం కేసులు ఈ 10 రాష్ట్రాల్లోనే ఉన్నాయని చెప్పింది.
ఇదీ చూడండి:వచ్చే ఐదు రోజులు వర్షాలే వర్షాలు!