రాజస్థాన్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 మార్కును దాటిన వేళ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వాలు ఇంధన దిగుమతులపై దృష్టి సారించి ఉంటే.. మధ్య తరగతి ప్రజలపై భారం పడేది కాదని అన్నారు. తమిళనాడులో చమురు, గ్యాస్ ప్రాజెక్టులను మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. రామనాథపురం-తూత్తుకుడి సహజవాయువు పైప్‌లైన్‌ను జాతికి అంకితమిచ్చారు.
"నేను ఎవర్నీ విమర్శించాలని అనుకోవడం లేదు. కానీ, మనం ఈ(ఇంధన దిగుమతులు) అంశంపై అంతకుముందే దృష్టి సారించి ఉంటే.. మధ్య తరగతి ప్రజలు ఇప్పుడు ఇబ్బంది పడే వారు కాదు."
-ప్రధాన మంత్రి, నరేంద్ర మోదీ.
రానున్న రోజుల్లో ఇంధనాల దిగుమతి వాటాను తగ్గిస్తామని మోదీ అన్నారు. 2030 నాటికి పునరుత్పాదక వనరుల నుంచి 40 శాతం ఇంధనాలు భారత్‌లో ఉత్పత్తి అవుతాయని తెలిపారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత్ 85 శాతం చమురు, 53 శాతం మేర సహజవాయువును దిగుమతి చేసుకుందని చెప్పారు.
మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని పెట్రోల్‌లో ఇథనాల్ మిక్సింగ్ వాటాను పెంచామని మోదీ పేర్కొన్నారు. చెరకు నుంచి ఇథనాల్ ఉత్పత్తి చేయడం వల్ల దిగమతులు తగ్గడమే కాకుండా.. రైతులకు అదనపు ఆదాయం చేకూరుతుందని చెప్పారు.