Power Crisis: దేశవ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. దీంతో కరెంటు ఉత్పత్తిని పెంచేందుకు ఆయా రాష్ట్రాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందుకోసం ఆయా రాష్ట్రాల్లోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గును వేగంగా తరలించేందుకు వీలుగా దేశవ్యాప్తంగా 1100 ప్రయాణికుల రైళ్ల ట్రిప్పులను రద్దు చేసినట్లు సమాచారం. అంతకుముందు 650 సర్వీసులను రద్దు చేసినట్లు భారత రైల్వే పేర్కొనగా.. తాజాగా కరెంటు సంక్షోభం మరింత ముదరడం వల్ల మరిన్నీ ట్రిప్పులను రద్దు చేసినట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో విద్యుత్ డిమాండ్ మరింత పెరగనున్న నేపథ్యంలో మే 24 వరకు ఈ సర్వీసుల రద్దు కొనసాగనున్నట్లు సమాచారం.
విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు బొగ్గును వేగంగా తరలించేందుకు వీలుగా వీటిని తాత్కాలికంగా రద్దు చేసినట్లు రైల్వేశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. దేశవ్యాప్తంగా 173 థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో దాదాపు 108 కేంద్రాలను బొగ్గు కొరత వేధిస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా దిల్లీ, రాజస్థాన్, పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాల్లోని విద్యుత్ కేంద్రాలు బొగ్గు కొరతను ఎదుర్కొంటున్నాయి. దీంతో పలు రైల్వే జోన్లలో ప్రయాణికుల రైలు సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేశారు. ఇలా రద్దు చేసిన ట్రిప్పుల్లో 500 మెయిల్ ఎక్స్‌ప్రెస్‌లు కాగా, మరో 580 ప్రయాణికుల రైళ్లు ఉన్నాయి.
ఇదిలాఉంటే, దేశవ్యాప్తంగా 70శాతం విద్యుత్ బొగ్గు ఆధారంగానే ఉత్పత్తి అవుతోంది. ఇందుకు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాలకు రైళ్ల ద్వారానే బొగ్గును తరలిస్తారు. ఈ క్రమంలో ప్రయాణికుల రైళ్ల రద్దీ దృష్ట్యా బొగ్గు తరలించే రైళ్లు ఆలస్యంగా నడుస్తుంటాయి. ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో బొగ్గు కొరత కారణంగా బొగ్గు రవాణా చేసే రైళ్లకు ప్రాధాన్యం ఇస్తూ వేగంగా తరలించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇదీ చూడండి: 650కి పైగా రైళ్లను రద్దు చేసిన కేంద్రం.. అదే కారణం