ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో సలహాదారుగా పనిచేస్తున్న మరో సీనియర్ అధికారి రాజీనామా చేశారు. పీఎంవోలో సామాజిక సంబంధమైన వ్యవహరాలను చూస్తున్న విశ్రాంత ఐఏఎస్ అధికారి అమర్జీత్ సిన్హా తన పదవికి రాజీనామా చేసినట్టు సమాచారం. బిహార్ క్యాడర్‌కు చెందిన అమర్జీత్ సిన్హా 1983 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. 2019లో గ్రామీణాభివృద్ధి కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన తర్వాత 2020 ఫిబ్రవరిలో రెండేళ్లపాటు పీఎంవో సలహాదారుగా నియమితులయ్యారు.
అయితే, పదవీ కాలం ఇంకా ఏడు నెలలు మిగిలి ఉండగానే తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం. గతంలో పీఎంవోలో ప్రిన్సిపల్ అడ్వైజర్‌గా పనిచేసిన మాజీ కేబినెట్ కార్యదర్శి పీకే సిన్హా రాజీనామా చేసిన కొన్ని నెలల్లోనే అమర్జీత్ కూడా తన పదవికి గుడ్‌బై చెప్పడం చర్చనీయాంశంగా మారింది. అమర్జీత్ తన రాజీనామాకు కారణాలను మాత్రం పేర్కొనలేదని సమాచారం.
ఇదీ చూడండి: ''ఈ-రూపీ'తో ఇక మరింత పక్కాగా డిజిటల్ పేమెంట్స్!'
ఇదీ చూడండి: వ్యాపారంలో చిన్నోళ్లు- భాషా జ్ఞానంలో ఘనులు!