త్వరలో ఎన్నికలు జరగనున్న పుదుచ్చేరి, తమిళనాడులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. గురువారం పర్యటించనున్నారు. పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేయనున్నారు.
పుదుచ్చేరిలో ప్రధాని..
ఉదయం 10:30 గంటలకు ప్రధాని.. పుదుచ్చేరికి చేరుకోనున్నారు. కరైకల్ జిల్లా పరిధిలోని సత్తనాథపురం-నాగపట్నం మధ్య ఎన్‌హెచ్ 45-ఏలోని 56 కిలోమీటర్ల రహదారి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. రూ.2,426 కోట్లతో ఈ రహదారి ప్రాజెక్టును చేపట్టనున్నారు. జవహార్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్టుగ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(జిప్మెర్) కేంద్రానికి చేరుకుని రక్త కేంద్రాన్ని ప్రధాని ప్రారంభించనున్నారు. అనంతరం ఆయన పాండిలో భాజపా ఆధ్వర్యంలో నిర్వహించనున్న బహింరంగ సభలో పాల్గొంటారు.
పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి ఇటీవల రాజీనామా చేసిన అనంతరంప్రధాని పర్యటన జరగనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
తమిళనాడులో ప్రధాని..
గురువారం సాయంత్రం 4 గంటలకు ప్రధాన మంత్రి.. తమిళనాడుకు చేరుకోనున్నారు. నైవేలిలో నిర్మించిన థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని జాతికి అంకితమివ్వనున్నారు. రూ.8,000 కోట్లతో ఈ విద్యుత్ కేంద్రాన్ని నిర్మించారు. ఎన్ఎల్సీఐఎల్కు చెందిన సౌర విద్యుత్ కేంద్రాన్ని కూడా ఆయన జాతికి అంకితమివ్వనున్నారు. పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు.
ఇదీ చదవండి:ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సహకారంపై త్రైపాక్షిక భేటీ