పర్యావరణ పరిరక్షణలో ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా ముందుకు సాగాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. గుజరాత్‌లోని కేవాడియాలోని ఏక్తా నగర్‌లో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్‌తో కలిసి ప్రధాని మోదీ మిషన్ లైఫ్ ప్రణాళికను ప్రారంభించారు. మిషన్ లైఫ్ కార్యాచరణ ప్రణాళిక, మిషన్ లైఫ్ లోగో, ట్యాగ్ లైన్‌లను ఆవిష్కరించారు. పర్యావరణ పరిరక్షణ నినాదాన్ని మిషన్ లైఫ్ మరింత బలోపేతం చేస్తుందన్నారు మోదీ. వాతావరణంపై ప్రజల సామూహిక విధానాన్ని మార్చే త్రిముఖ వ్యూహాన్ని అనుసరించడం దీని లక్ష్యమని స్పష్టం చేశారు.
"వాతావరణ మార్పు అనేది విధానపర సమస్యని ఒక అభిప్రాయాన్ని సృష్టించారు. దీనికి సంబంధించిన చర్యలు ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలు తీసుకుంటాయని అందరూ భావిస్తున్నారు. ఇది నిజమే. వాతావరణ రక్షణలో ప్రభుత్వాలు అంతర్జాతీయ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. కానీ ప్రతి ఇంటిలోనూ మార్పు రావాలి. నేడు మన హిమానీనదాలు కరిగిపోతున్నాయి. సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. నదులు ఎండిపోతున్నాయి. రుతు పవనాల రాకలో అనిశ్చితి ఏర్పడింది. ఈ సమస్యలన్నింటికీ సమాధానం.. మిషన్ లైఫ్‌లో ఉంది. వాతావరణ జీవన విధానమే.. మిషన్ లైఫ్ మంత్రం. మిషన్ లైఫ్ ఈ పుడమిని రక్షించుకునేందుకు ప్రతీ ఒక్కరి శక్తిని క్రోడికరిస్తుంది . మన రోజు వారీ విధానంలో పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా మిషన్ లైఫ్ మనలను ప్రేరేపిస్తుంది.
--నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
భారత్ ఆర్థిక, సాంకేతిక సహకారంతో వాతావరణ మార్పులపై యుద్ధం చేస్తామని.. ఐక్య రాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ అన్నారు. తాము పునరుత్పాదక విప్లవాన్ని సృష్టించాల్సి ఉందన్న గుటెర్రస్.. దీని కోసం భారత్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రపంచంలో 80 శాతం కర్బన ఉద్గారాలు జీ20 దేశాల్లోనే విడుదల అవుతున్నాయన్న ఆయన.. దీనిపై చర్యలకు ఉపక్రమించాల్సిన అవసరం ఉందన్నారు.
మిషన్ లైఫ్ ఉద్యమం ప్రారంభించిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి.. ప్రపంచ దేశాధినేతలు అభినందనలు తెలిపారు. ఫ్రాన్స్, బ్రిటన్, మాల్దీవులు సహా పలు దేశాల అధ్యక్షులు, ప్రధానులు.. భారత్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధమని ప్రకటించారు. ప్రపంచ సవాళ్లను వాతావరణ మార్పులను సంఘటితంగానే ఎదుర్కోవాలని, దాని కోసం భారత్‌తో కలిసి పని చేస్తామని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ అన్నారు. ఇంధన స్వాతంత్ర్యం ఆర్థిక వ్యవస్థలను రక్షించడానికి భారత్‌తో కలిసి పని చేస్తామని బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్.. తెలిపారు. మిషన్ లైఫ్ ప్రారంభించిన భారత నాయకత్వాన్ని ఆమె ప్రశంసించారు. మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మొహమ్మద్ సోలిహ్, ఎస్టోనియా ప్రధాని కాజా కల్లాస్, జార్జియా ప్రధాని ఇరాక్లీ గరీబాష్విలి, గయానా అధ్యక్షుడు ఇఫ్రాన్ అలీ, మడగాస్కర్ అధ్యక్షుడు ఆండ్రీ రాజోలినా వీడియో సందేశాలను పంపించారు.
ఇదీ చదవండి: భుజంపై చిన్నారి మృతదేహం.. అంబులెన్సు లేక బస్సులో ఇంటికి ప్రయాణం