Parrot Missing Case: ఛత్తీస్గఢ్ బస్తర్ జిల్లా జగదల్పుర్లో ఓ విచిత్ర కేసు నమోదైంది. మనీశ్ ఠక్కర్ అనే వ్యక్తి తను ఎంతో ప్రేమగా పెంచుకున్న ఓ రామచిలక వెన్నుపోటు పొడిచి పారిపోయిందని పోలీసులను ఆశ్రయించాడు. కోత్వాలీ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశాడు. చిలకకు ప్రతిరోజు ఆహారం అందించి ఎంతో ఆప్యాయంగా చూసుకున్నానని, కానీ అది మాత్రం తనను మోసం చేసి ఎగిరిపోయిందని వాపోయాడు.
chhattisgarh Parrot news: ప్రతిరోజు చిలకను పంజరంలోనే ఉంచే వాడినని మనీశ్ చెప్పాడు. ఏడు సంవత్సరాలుగా దాన్ని కుటుంబసభ్యురాలిగా చుసుకుంటున్నామని వివరించాడు. ఉదయం, సాయంత్రం ఆహారం అందిస్తున్నట్లు పేర్కొన్నాడు. కానీ గురువారం పంజరం తెరవగానే అది ఎగిరిపోయిందని, మళ్లీ వెనక్కి తిరిగి రాలేదని తెలిపాడు. దాన్ని ఎలాగైనా వెతికిపెట్టాలని పోలీసులను కోరాడు. మనీశ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు చిలకను వెతకడం ప్రారంభించారు. నగరంలోని సీసీటీవీలను పరిశీలించడం మొదలుపెట్టారు. వీలైనంత త్వరగా చిలక జాడను గుర్తించి పట్టుకుంటామన్నారు.
Bihar parrot missing news: బిహార్ గయాలోనూ ఇటీవల ఇలాంటి ఘటనే జరిగింది. చిలకను ప్రేమగా పెంచుకున్న ఓ కుటుంబం.. అది తమను విడిచిపెట్టి వెళ్లిపోయిందని చెప్పింది. ఏప్రిల్లో ఈ ఘటన జరగ్గా.. చిలక జాడ కోసం ఆ కుటుంబసభ్యులు వెతుకుతూనే ఉన్నారు. అయితే వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయలేదు. చిలక మిస్ అయిందని పోస్టర్లు అంటించారు. దాని జాడ చెప్పిన వారికి రూ.5,500 రివార్డు కూడా ఇస్తామన్నారు.
ఇదీ చదవండి: ఆంగ్లేయుల అరాచకం.. మనుషులనే కాదు 80వేల పులుల్ని చంపి..